ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు చాలా హాట్ హాట్‌గానే ఉంటాయి. విమర్శలు చేయడానికి వ్యక్తులు, ప్రాంతాలు, వర్గాలు అనే సంబంధం లేకుండా ఎప్పుడు ఏదో వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇక రాష్ట్రంలో ఏవైనా ఉద్రిక్త పరిస్థితులు, సంఘటనలు తలెత్తితే.. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పరిపాటి. కానీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ విభిన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలు, నాయకులు, ప్రాంతాలు అనే విషయాలను పక్కకు పెట్టి అందరూ ఏకతాటి మీదకు వచ్చారు. మరి ఏపీ రాజకీయాల్లో.. ఇంత స్వచ్ఛమైన వాతావరణం కనిపించేలా చేసిన ఆ సంఘటన ఏది అంటే.. నందమూరి తారకరత్న అనారోగ్యం.
యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన నందమూరి తారకరత్న.. ఉన్నట్లుండి గుండెపోటుకు గురయ్యి.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇక తారకరత్న పరిస్థితిపై ప్రతి ఒక్కరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సాధారణంగా.. ఏపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే.. పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటాయి. సోషల్ మీడియాలో కూడా నానా రచ్చ చేస్తారు.
కానీ తారకరత్న విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. తారకరత్న క్షేమంగా ఉండాలని తెలుగుదేశం, నందమూరి అభిమానులు మాత్రమే కాక.. వైసీపీ, జనసేన కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. తారకరత్న ఏ పార్టీ వాడు.. ఏ ప్రాంతం వాడు.. ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనే భావనలను పక్కకు పెట్టి.. అందరూ ఏకతాటిపైకి వచ్చి.. ఆయన మేలు కోసం ప్రార్థిస్తుండటం గమనార్హం. వివాదారహితుడు, నిగర్వి అయిన తారకరత్న విషయంలో ఇలాంటి స్పందన సహజమే అయినప్పటికి.. రాజకీయ వర్గాల్లో కనిపిస్తున స్వచ్ఛత మాత్రం జనాలని ఆశ్చర్యపరుస్తోంది.
తారకరత్నది టీడీపీ.. కానీ ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసినప్పటి నుంచి వైసీపీ, జనసేన కార్యకర్తలు.. పార్టీల మధ్య వైరాన్ని మరిచి.. ఆయన కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయడం చూసి జనాలు సంతోషిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో కూడా పార్టీలన్ని ఇలా ఏకతాటిపైకి వస్తే.. అభివృద్ధి విషయంలో ఏపీని ఎవరు ఆపలేరు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మరి ఏపీలో కనిపిస్తోన్న ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.