ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు విచారణలో వేగం పెంచారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు జారీ చేశారు. మార్చి 9న విచారణకు హాజరు కావాలంటూ కోరారు. కానీ, గురువారం విచారణకు హాజరవ్వడం కుదరదని కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురికి ఈడీ నోటీసులు ఇవ్వడం అరెస్టులు చేయడం కూడా చేసింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరారు. అయితే మార్చి 9న ఈడీ విచారణకు హాజరు కాలేనని కవిత వెల్లడించారు. మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు ధర్నా కార్యక్రమం తలపెట్టారు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కాలేని ఈడీకి వెల్లడించారు.
మార్చి 15న తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ విషయంలో కుమార్తెతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. కవితకు పలు సూచనలు కూడా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దగానే కాకుండా తండ్రిగా కూడా కవితకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. “ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్రం అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదాం” అంటూ కవితతో ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత కవిత ఢిల్లీకి పయనమయ్యారు. గురువారం విచారణకు హాజరు కాలేనని.. మార్చి 15న హాజరవుతానని చెప్తూ కవిత ఈడీ అధికారులకు లేఖ రాశారు. అయితే ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు పీఎంఎల్ఏ 50/2 కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను సవాలు చేయాలంటే ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉందని చెబుతున్నారు.
కానీ, ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్ అంగీకరించడంతో ఆ అవసరం లేదని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారుల తర్వాత స్టెప్ ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు కవిత అరెస్టుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్టు చేస్తారా? అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. అయితే ఆ విషయంపై మాత్రం ఇప్పుడే ఎలాంటి కంక్లూజన్ కు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంక కవిత ధర్నా విషయానికి వస్తే.. ఇప్పటికే కవిత ఢిల్లీ చేరుకున్నారు. మార్చి 10న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భారత జాగృతి దీక్షలో పాల్గొంటారు.