గన్నవరం ఎపిసోడ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఎట్టకేలకు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని తెలిపారు.
గన్నవరం ఎపిసోడ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ఎట్టకేలకు నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పట్టాభి.. తనపై పోలీసు స్టేషన్‌లో దాడి జరిగిందని తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను అక్రమంగా కేసుల్లో ఇరికించారని ఆయన వాపోయారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి మరీ తనను కొట్టారని ఆరోపించారు. తనపై ఇప్పటికే నాలుగు సార్లు దాడి జరిగిందని.. అయినప్పటికీ ప్రభుత్వంపై తన పోరాటం ఆగదని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు.
“టీడీపీ బలహీనవర్గాల పార్టీ.. బలహీన వర్గాలు వెన్నెముకగా నిలిచిన పార్టీ. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నన్ను అక్రమంగా కేసుల్లో ఇరికించారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి మరీ నన్ను కొట్టారు. ముగ్గురు దుండగులను లోనికి పంపి అర్ధరాత్రి రెండు నుంచి ఐదు గంటల వరకు నన్ను అతి క్రూరంగా కొట్టించి, హింసించారు. ఈ దాడిని ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పటికే నాలుగు సార్లు తనపై దాడి జరిగింది. అయినప్పటికీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజల పక్షాన మాట్లాడుతున్న ఈ గొంతుక ఆగేది లేదు..” అని పట్టాభి రామ్ చెప్పుకొచ్చారు.
కొద్ది రోజుల క్రితం పట్టాభి రామ్ గన్నవరంలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వైసీపీ కార్యాకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయాలన్ని ధ్వంసం చేసినట్లు వార్తలోచ్చాయి. ఈ ఘటనపై ఆయన నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి పిలుపునివ్వడం.. పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత పట్టాభి రామ్ తనపై వ్యక్తి గత దూషణకు దిగారంటూ గన్నవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కనకరావు పిర్యాదు మేరకు పట్టాభి సహా మరి కొంతమంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత స్థానిక కోర్టు పట్టాభికి, టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అక్కడే రిమాండ్ ఖైదీకి ఉన్న పట్టాభికి ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని స్పష్టం చేసింది. పట్టాభి తదితరులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. బెయిల్ పై విడుదలయిన పట్టాభికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. పట్టాభి హత్యకు కూడా కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే.. న్యాయ వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని అన్నారు. పట్టాభిపై ప్రభుత్వం దుర్మార్గపు విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పట్టాభి వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.