టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పట్టాభిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పట్టాభి అరెస్టుపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. శనివారం పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలోనే పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ప్రస్తుతం పట్టాభి రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయవాడ గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో బుధవారం రాత్రి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం పట్టాభిని విజయవాడ కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మచిలీపట్నం తరలించి కొవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. పట్టాభి అరెస్టును ఖండిస్తూ తెదేపా శ్రేణులు నిరసనలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే.