తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లీలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్ లో రచ్చ ప్రారంభం అయ్యింది. తన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం పట్ల ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రచ్చబండకు హాజరు కానని స్పష్టం చేశారు. రేవంత్ తీరుపై పార్టీ సీనియర్ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు సరికావని తెలిపారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాక జగ్గారెడ్డి.. కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. కారెక్కుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి : బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సవాల్ విసిరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఈ వార్తలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. అవసరమైతే.. ఇండిపెండెంట్ గా ఉంటాను తప్పితే.. ఏ పార్టీలో చేరనని కుండ బద్దలు కొట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాజీనామా వార్తలు అవాస్తవం. చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటా. అయితే పార్టీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటి గురించి నేరుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే తెలియజేయాలని భావిస్తున్నాను. వారిని కలవడానికి అపాయింట్‌మెంట్ అడుగుతా. సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో జీవితాంతం పనిచేస్తా. నా వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఇండిపెండెంట్‌గా ఉంటా తప్పితే.. మరో పార్టీలోకి వెళ్ళను. ఈ నెల 20 తర్వాత భవిష్యత్ కార్యచరణ గురించి తెలియజేస్తాను’’ అన్నారు జగ్గారెడ్డి. ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.