మునుగోడులో ఉప ఎన్నిక హీట్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మిగతా పార్టీలతో పోలిస్తే.. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కి అత్యంత కీలకం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక ఏళ్లుగా మునుగోడు.. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. కానీ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పరిస్థితి తారుమరయ్యింది. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది.. తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మునుగోడులో గెలుపు కోసం కాంగ్రెస్ లక్ష మంది కాళ్లు మొక్కడం వంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఆమె గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి.. పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపూర్, కోతులపురం, అల్లందేవిచెరువు, సర్వేల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సమావేశాల్లో టీఆర్‌ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై 120కి పైగా కేసులు పెట్టిందని.. కానీ తాను భయపడనని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల కోసం ఎన్నిసార్లు జైలుకెళ్లడానికి అయినా తాను సిద్ధమే అని స్పష్టం చేశారు. గతంలో జైలులో తిన్న చిప్పకూడు సాక్షిగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తానని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి కోడలిలా వచ్చానని.. మెట్టినింటి పరువు నిలబెడతానని తెలిపారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి కోడలి లాగా వచ్చాడని.. తాను టీడీపీ బిడ్డనని.. ఆ పార్టీ తన పుట్టినిల్లు అని.. తాను కాంగ్రెస్‌లోకి కోడలిలాగా వచ్చానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టిల్లు అయిన తెలుగు దేశం నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. పార్టీలోకి కోడలులాగా వచ్చిన తాను.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెడతానని రేవంత్ స్పష్టం చేశారు. ప్రసుత్తం తాను కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నాని వెల్లడించారు. ఇక మునుగోడులో కాంగ్రెస్ గెలుపే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మరి కోడలి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి