అతి త్వరలో ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రతో జనసేనకు మైలేజీ రావటం ఖాయం. ఇదే విషయాన్ని హరిరామ జోగయ్య జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చెప్పుకొచ్చారు.
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరమూ ఊహించలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితులు రేపు ఉండవు. ఒక్కోసారి అనుకోని రీతిలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే, జనసేన పార్టీ విషయంలో మాత్రం ఇలా జరగటం లేదు. ఆ పార్టీ విషయంలో ప్రజల్లో ఓ స్థిరమైన ఎదుగుదల కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన.. ఈ సారి పదుల సంఖ్యలో సీట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్నే చాలా మంది రాజకీయ విశ్లేషకులు నొక్కి వక్కానిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేయటం వల్ల ఒకలాంటి ప్రభావం ఉంటే.. పొత్తులోకి వెళితే మరోలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు! పవన్ కల్యాణ్ చేపట్టబోయే వారాహి బస్సు యాత్ర ద్వారా ఏపీలో జనసేన ప్రభావం బాగా ఉంటుందని కూడా అంటున్నారు.
ఇదే విషయాన్ని మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు నేత చేకుండి హరిరామ జోగయ్య కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై హరిరామ జోగయ్య ఓ జోష్యాన్ని చెప్పారు. పవన్ వారాహి యాత్రకు ముందు ఒకలాంటి ప్రభావం ఉంటే.. వారాహి యాత్ర తర్వాత ఇంకోలాంటి ప్రభావం ఉంటుందని అన్నారు. బస్సు యాత్ర మొదలయ్యే నాటికి జనసేన ఓటర్ల శాతం 14గా ఉంటుందని, పార్టీ 15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక, తెలుగు దేశం ఓటర్ల శాతం 38 కాగా, 65 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అన్నారు.
అధికార వైఎస్సార్ సీపీ 47 శాతం ఓటర్లను కలిగి ఉంటుందని, 95 స్థానాల్లో గెలుస్తుందని అన్నారు. ఇక, మిగిలిన వారు ఒక స్థానం కూడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఇది వారాహి యాత్ర పూర్తవ్వటానికి ముందు పరిస్థితి. ఒక వేళ వారాహి యాత్ర పూర్తయితే.. ప్రజల్లో జనసేన ప్రభావం పెరిగిపోతుంది. ఓటర్ల శాతం, గెలిచే స్థానాలు కూడా పెరుగుతాయి. వారాహి యాత్ర తర్వాత జనసేన ఓటింగ్ శాతం 20కు పెరుగుతుంది. ఏకంగా 40 స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీడీపీ ఓటర్ల శాతం స్థిరంగా ఉంటుంది. గెలిచే స్థానాలు తగ్గి 55కు పడిపోతుంది. అధికార వైఎస్సార్ సీపీ విషయంలోనూ ఇదే జరుగుతుంది.
ఓటర్ల శాతం 40కు పడిపోతుంది. గెలిచే స్థానాలు కూడా 80కు చేరుకుంటాయి. ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇది కేవలం హరిరామ జోగయ్య జోష్యం మాత్రమే. జనసేన ఆయన అనుకున్న స్థానాల్లో గెలవవచ్చు.. అదృష్టం బాగుంటే అంతకంటే ఎక్కువ స్థానాల్లోనే గెలవొచ్చు. ఏది ఏమైనా హరిరామ జోగయ్య జోష్యంతో జనసేన కార్యకర్తలు, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండుకుంది. జనసేనకు మంచి రోజులు రాబోతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి, హరిరామ జోగయ్య ఎన్నికల జోష్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.