ఆంధ్రప్రదేశ్‌లో 9 ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్ర 4 గంటల వరకు కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న మొత్తం ఆరు జిల్లాల పరిధిలో 331 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 4,482 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్‌ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎమ్మెల్సే ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా.. రెండు ప్రాంతాల్లో మాత్రం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికి రెండు చోట్ల మాత్రం రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. శ్రీకాకుళం, తిరుపతిలో రెండు చోట్ల రీపోలింగ్‌ను నిర్వహించనున్నారు. శ్రీకాకుళంలో పోలింగ్ సమయంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అంతేకాక ఇక్కడ స్థానిక టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారంటూ పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇక తిరుపతిలోనూ ఓటింగ్ సమయంలో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ రెండు చోట్ల బుధవారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఉత్తరాంధ్ర పట్టుభద్ర ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 37 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు బరిలో 22 మంది అభ్యర్థులు, కడప-అనంతపురం బరిలో 49 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 12 మంది నిలిచారు. ఇక ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ వెంటనే ఫలితాలు విడుదల చేస్తారు.