ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా మారాయి. స్థానిక సంస్థలు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార వైసీపీ విజయ ముందంజలో ఉండగా.. గ్రాడ్యుయేట్ స్థానాలకు వచ్చే సరికి అంచనాలు తారుమారు అయ్యాయి. యువత ఇచ్చిన తీర్పు చూసి.. వైసీపీ నేతలు షాకవుతున్నారు. మరి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అంటే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే వీటిని సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే తెలంగాణలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించి.. బీఆర్‌ఎస్‌కు గట్టి షాకిచ్చారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ భారీ ఆధిక్యం దిశగా పరుగులు తీస్తుండటం.. ఆసక్తికరంగా మారింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య రవసత్తర పోటీ నడుస్తోంది.
రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలను చూసి టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు. ఈ ఆధిక్యం ఇలానే కొనసాగి.. చివరకు టీడీపీ గెలిస్తే.. ఇది వైసీపీకి పెద్ద షాక్ అని.. దీని ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై బలంగా ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రెండు స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది.. దానికి.. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం ఏంటి అంటే.. ఈ రెండు స్థానాలు.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాలు. అనగా పట్టభద్రులు.. యువత. ఎన్నికలు ఏవైనా సరే.. యువతరం ఓట్లే.. ఫలితాల్లో కీలకంగా మారతాయి. పైగా యువతలో చాలా మంది అక్షరాస్యులు.. మరీ ముఖ్యంగా నిరుద్యోగులు అధికంగా ఉంటారు. ప్రభుత్వ పని తీరుపై యువతలో ఎలాంటి అభిప్రాయం ఉంది.. వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇక తాజాగా ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార వైసీపీకి యువత భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ పని తీరుపై తమ అభిప్రాయం ఏంటో ఈ ఎన్నికల్లో వారు స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల మీదనే ఆధారపడుతోంది. ప్రతి నెల ఏదో సంక్షేమ పథకం పేరు చెప్పి.. లబ్ధిదారులు ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తోంది. దీన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. అదే సమయంలో రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వం విఫలమయ్యిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు.. ఉపాధి అవకాశాలు పెరగడం లేదు.. ఉద్యోగాలు లభించడం లేదు అంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఇందులో కొంత వాస్తవం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీకి కొత్త పరిశ్రమలు రాలేదు.. ఉపాధి అవకాశాలు పెరగలేదు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. పైగా గతంలో వచ్చిన పరిశ్రమలు సైతం రాష్ట్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోతున్నాయి అంటూ ప్రతిపక్ష పార్టీలు నిత్యం ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ 2019 ఎన్నికల ప్రచారం వేళ.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం.. ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు విడుదల చేస్తాం అన్నారు. కానీ వాస్తవంగా వచ్చే సరికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయక.. ప్రైవేట్ కంపెనీల్లో అవకాశాలు లభించకపోవడంతో.. యువతలో భవిష్యత్తు మీద భయం, బెంగ మొదలయ్యాయి.
దాంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. అందుకు నిదర్శనమే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎంత సేపు సంక్షేమం అంటూ కూర్చుంటే సరిపోదు.. అభివృద్ధి కూడా ముఖ్యమే.. కానీ వైసీపీ ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇది వైసీపీ గెలుపుపై భారీ ప్రభావం చూపుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టెమెంట్ సమ్మిట్ నిర్వహించాం.. 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి కదా అంటే.. అవన్ని ఆచరణ రూపం దాల్చిన నాడు లెక్క. ప్రస్తుతం యువత వాటిని పట్టించుకోదు. అందుకే విశాఖలో అంత పెద్ద పారిశ్రామిక సదస్సు నిర్వహించినప్పటికి.. ఇలాంటి ఫలితాలు వెలువడ్డాయి అంటున్నారు. ఈ ఫలితాలను చూస్తే.. వైసీపీ ప్రభుత్వం పట్ల యువతలో వ్యతిరేకత ప్రారంభం అయ్యిందని.. ఇప్పటికైనా జగన్ సర్కార్ కళ్లు తెరిచి.. దిద్దుబాటు చర్యలకు పూనుకోకపోయినా.. గుణపాఠం నేర్చుకోకపోయినా.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం భారీగానే ఉంటుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాల తీరు.. రాష్ట్రంలోని మొత్తం యువత అభిప్రాయాలకు అద్దం పడుతుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.