ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ.. అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. రెండు చోట్లా ఘన విజయం సాధించి.. సత్తా చాటింది. తాజా ఫలితాలు చూసి అధికార పార్టీ నేతలు షాకవుతున్నారు. ఆ వివరాలు...
రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఊహించని ఫలితాలు వెలువడి.. అధికార పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి. తెలంగాణలో బీజేపీ విజయం సాధించి.. బీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వగా.. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా 2 చోట్లా టీడీపీ సత్తా చాటి.. వైసీపీకి భారీ షాక్ ఇచ్చింది. ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయం సాధించారు. ఆయనకి తొలుత మొదటి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దాంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా.. 94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించడంతో చిరంజీవి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నికల్లో గెలిచారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ఇటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు. ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యతా ఓట్లు లెక్కించినప్పుడు శ్రీకాంత్ 50 శాతానికి పైగా ఓట్లు సాధించేలేదు. దాంతో ఎన్నికల అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. వాటిల్లో శ్రీకాంత్.. భారీ మెజారిటీ సాధించడంతో.. ఆయన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే శ్రీకాంత్ ఎంత మెజార్టీతో విజయం సాధించారు అనేది తేలాల్సి ఉంది. అలానే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి లెక్కింపు కొనసాగుతోంది. అక్కడ వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.
ఇక ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావుది అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి. ఆయన కొత్తకోటలో ఇంటర్ చదివారు. డిగ్రీ, బీఈడీ తర్వాత ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. 1996 డీఎస్సీలో ఎంపికై ఎస్‌జీటీగా ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత స్కూలు అసిస్టెంట్, జూనియర్, డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ పదవీవిరమణ చేశారు. ఇక ఆయన భార్య నివేదిత విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. విద్యావేత్తగా, అర్థశాస్త్ర అధ్యాపకుడిగా చిరంజీవికి ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉంది.
చిరంజీవిరావుకి ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా 12 ఏళ్ల అనుభవం ఉంది. అంతేకాక ఆయన విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆర్‌సీ రెడ్డి కోచింగ్ సెంటర్‌లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. చిరంజీవిరావు ఎందరో విద్యార్థుల చదువులకు ఆర్థికసాయం చేశారు. పలు వెబ్‌సైట్లలో విద్యార్థులకు ఎకనమిక్స్‌కు సంబంధించి అవసరమైన సలహాలు, సూచనలు ఉచింతంగా అందించారు. అంతేకాదు ఏయూలో పూర్వ విద్యార్థులతో కలిసి హుద్‌హుద్ తుపాను సమయంలో ఆయన విశిష్ట సేవలందించారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కొవిడ్ సమయంలో పేదలకు ఉచితంగా సరకులు పంపిణీ చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ఇలా ఆయనకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచిన కంచర్ల శ్రీకాంత్ సొంత ఊరు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం అత్తంటివారిపాలెం గ్రామం. శ్రీకాంత్ బీటెక్, ఎంబీఏ, ఎంఐఈ పూర్తి చేశారు. అంతేకాక 2018లో డాక్టరేట్ కూడా అందుకున్నారు. కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ ట్రెజరర్‌గా పని చేశారు. 2009 నుంచి టీడీపీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక 2014లో కందుకూరు నుంచి టీడీపీ జడ్పీటీసీ సభ్యునిగా పోటీచేసి విజయం సాధించారు. ఉత్తమ జడ్పీటీసీ సభ్యునిగా 2017లో అవార్డు కూడా అందుకున్నారు.
ఇక సమాజ సేవలోనూ శ్రీకాంత్ ముందుంటాడు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ కళాశాలల్లో చదువుల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేవారు. 2021లో ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించగా.. ఘన విజయం సాధించారు. మరి ఈ ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.