వినోదభరితమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలతో కనువిందు భోజనం వడ్డిస్తూ ప్రేక్షకులతో ఆహా అనిపిస్తున్న ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తాజాగా మరో సినిమాతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. అలీ ప్రధాన పాత్రలో నటించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో వచ్చిన ‘వికృతి’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను స్థాపించి.. మొదటి సినిమాగా ఈ సినిమాను నిర్మించారు అలీ. ఆ మధ్య లాయర్ విశ్వనాథ్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఆడపిల్లల మీద అత్యాచారం జరగడానికి గల కారణం సెల్ ఫోన్ లో బూతు వీడియోలు చూడడమే అని, అటువంటి వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని పోరాటం చేసే మధ్యతరగతి కుటుంబానికి చెందిన లాయర్ గా పోరాటం చేసే పాత్రలో అలీ అద్భుతంగా నటించారు.
సమాజానికి మంచి సందేశాన్నివ్వాలన్న ఆయన ఆకాంక్షకు కొనసాగింపుగా ఇప్పుడు ఈ సినిమా వస్తోంది. ప్రస్తుత సొసైటీ ఆఫ్ డిజిటల్ ఇండియాలో సెల్ఫీ, సోషల్ మీడియా వంటి పదార్థాలు ఎలా సమాజాన్ని ఎలా శాసిస్తున్నాయో మనకి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సెల్ఫీ, సోషల్ మీడియాలను వాడుకుని సినిమాని తెరకెక్కించారు. దీనికి సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే సినిమా ఆద్యంతం హాస్యం, ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అర్ధమవుతోంది. ఈ సినిమాలో అలీకి సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం బాగా అలవాటు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో వల్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అన్న ఆసక్తికర పాయింట్ తో సినిమా తెరకెక్కింది. నరేష్, పవిత్ర లోకేష్, మౌర్యాని, మంజు భార్గవి, తణికెళ్లభరణి, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 28 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.