యువతి బండబూతులు తిట్టిందని ఓ 25 ఏళ్ల యువకుడు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అలా అని సదురు యువకుడు యువతితో గొడవ పెట్టుకోలేదు. పొరపాటున యువతి కాలు తొక్కాడట. అంతే.. అతడికి జీవితంపై విరక్తి కలిగేలా తిట్టిందట.
ఈ కథనం హెడ్డింగ్ చూడగానే.. తిట్టినందుకు ప్రాణాలు తీసుకోవాలా..? అన్న మీకు సందేహం రావచ్చు. తిట్లను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయడానికి అతడు రాజకీయ నాయకుడు కాదు.. అందుకే, అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అందులోనూ.. సదరు యువతి తిట్టిన తిట్లు అతడు ఇంతకుముందెన్నడూ వినలేదట. అంత దారుణంగా తిట్టిందట. ఇక బ్రతికున్నా నిత్యం తను, తన తిట్లే గుర్తొస్తాయన్న బాధతో జీవితమే వద్దనుకున్నాడు. హైటెన్షన్ విద్యుత్ స్థంభం ఎక్కి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీనంతటికి కారణం.. అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.
బస్సు, రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు విపరీతమైన రద్దీ ఉంటుంది. ప్రధానంగా రైలు ప్రయాణంలో ఇలాంటి సమస్యలు ఎక్కువ. త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో ఎంత రద్దీ ఉన్నా.. ఎలాగోలా ఇరుక్కుని మరీ ప్రయాణం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందులో ప్రధానంగా ఒకరి కాళ్లు మరొకరు తొక్కడం, ఒకరిపై మరొకరు తల పెట్టి పడుకోవడం. రైలు ప్రయాణం చేసిన ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూసుంటారు. అందరిలానే ఉత్తర్ ప్రదేశ్ కు ఓ 25 ఏళ్ల యువకుడు అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం సాగిస్తున్నాడు. ట్రైన్ ఫుల్ రద్దీగా ఉండటంతో పొరపాటున ఒక యువతి కాలు తొక్కాడు. అంతే.. సదరు యువతి తెరిచిన నోరు.. ఆ నోటి నుండి వెలువడ్డ తిట్ల పురాణాలు రైలు మరోచోట ఆగేవరకు ఆపలేదట. పైగా అమ్మాయి అందంగా ఉండటంతో ప్రయాణికులందరూ ఆమె వైపే మాట్లాడారట.
దీన్ని అవమాన భారంగా ఫీలైన యువకుడు.. ఇక తాను జీవించి ఉండడం నిరుపయోగం అనుకున్నాడు. రైలు ఆగిన వెంటనే బోగీ నుంచి వేగంగా కిందకు దిగి, పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కాడు. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నానా రచ్చ చేశాడు. రైలు ప్రయాణికులంతా అక్కడ గుమికూడినప్పటికీ.. ఎందుకు ఎక్కాడు..? ఏం జరుగుతుందో వారికి ఏమాత్రం అర్థం కాలేదు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అసలు విషయం తెలుసుకున్నారు. అనంతరం యువకుడికి ఎలాగోలా నచ్చజెప్పి, కిందకు దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ పరిధిలోని దహీ పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, యువకుడి ఆత్మహత్యయత్నానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.