తిరుమల- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంపై మాటల యుధ్దం చేసుకుంటున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, రాజోలిబండ లెఫ్ట్ కెనాల్ పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడంపై జగన్ సర్కార్ మండిపడుతోంది. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంటోంది.
కృష్ణా జల వివాదంపై వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా స్పందించారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి జలాశయాల నీటిని ఏకపక్షంగా వాడుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి తగదని ఆమె అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు, నగరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తాను అనారోగ్యం నుండి కోలుకున్నానని ఆమె చెప్పారు.
కృష్ణా జల వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నానని రోజా అన్నారు. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఏపీకి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాల వివాదాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ మంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్నారని రోజా ఆవేధన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మౌనాన్ని చేతకానితనంగా భావించవద్దని, నోరు అదుపులో పెట్టుకోకపోతే మర్యాదగా ఉండదని రోజా హెచ్చరించారు.
తెలంగాణకు చేతులెత్తి దండం పెడుతున్నా, కృష్ణా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వాడుకుని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు రోజా. అంతే కాదు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ అక్రమంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ఏపీకి అన్యాయం చేయాలని చూస్తే ఉరుకునేది లేదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తే ముఖ్యమంత్రి జగన్ సహా తామెవరూ సహించేది లేదని రోజా వ్యాఖ్యానించారు.