అమరావతి- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కన్నీళ్లు పెట్టుకోవడం ఎంతటి సంచలనం రేపిందో అందరికి తెలుసు. ఈ అంశంలో అధికార వైపీసీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుధ్దం కొనుసాగతూనే ఉంది. ఇక ఈ ఇష్యూలోకి జూయినర్ ఎన్టీఆర్ ను కూడా లాగడంతో వ్యవహారం మరింత ముదిరింది.
ఐతే తాము చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అంతా చంద్రబాబు కల్పితమేనని వైసీపీ నేతలు కొట్టిపారేస్తూ వచ్చారు. ఇదిగో ఇటువంటి సమయంలో భువనేశ్వరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు దేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎట్టకేలకు దిగొచ్చారు. భువనేశ్వరిపై తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని ఆయన ఒప్పుకున్నారు. చంద్రబాబు సతీమణికి క్షమాపణ చెబుతున్నట్లు వల్లభనేని వంశి స్పష్టం చేశారు.
ఎమోషన్ లో ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవమేనని అన్నారు. భువనేశ్వరిపై తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నట్లు వంశి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. టీడీపీలో తనకు అందరికంటే నారా భువనేశ్వరి అత్యంత ఆత్మీయురాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. భువనేశ్వరిని తాను అక్కా అని పిలుస్తానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఐతే కమ్మ కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను క్షమాపణ చెప్పలేదని వంశీ స్పష్టం చేశారు.
తాను భువనేశ్వరికి మనస్పూర్తిగానే క్షమాపణ చెబుతున్నట్లు చెప్పారు. అంతే కాదు ఈ విషయంలో చంద్రబాబును కూడా క్షమాపణలు కోరుతున్నట్లు వంశీ అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుపై వల్లభనేని వంశీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కుట్రలు పన్నడం చంద్రబాబు నేచర్ అని అన్నారు. చంద్రబాబే ఈ కులానికి పట్టిన అతిపెద్ద చీడపురుగు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఉండగా ఈ కులం బాగుపడదని ఘాటుగా కామెంట్ చేశారు. తనతో పెట్టుకున్న వాళ్లు బతకలేదని సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే ఇటీవల చంద్రబాబు బెదిరించారని వంశీ వ్యాఖ్యానించారు.