అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య కళ్యాణం పచ్చ తోరణం. తిరుమల పేరు వింటేనే మనకు ఏడు కొండలు గుర్తుకు వస్తాయి. కాలంతో పని లేకుండా ఎప్పుడూ పచ్చగా ఉండే తిరుమల గిరులను చూస్తే మనసు ఉప్పొంగిపోతుంది. అలా ఏడు కొండలు ఎక్కుతుంటే ఆ ప్రకృతి అందాలకు మైమరిచిపోవాల్సిందే. తిరుమల కొండలు అంత పచ్చగా కళకళలాడటానికి అకేసియా వృక్షాలు. తుమ్మ జాతికి చెందిన అకేసియా చెట్లు దట్టమైన ముళ్లతో కూడి ఉంటాయి. ఇవి ఫాబేసి కుటుంబంలోని అకేసియా జాతికి చెందినవి. ముళ్లతో కూడిన కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగులో పువ్వులు కలిగి ఉంటాయి.
తిరుమల కొండల్లో సుమారు 2వేల ఎకరాల్లో ఈ అకేసియా చెట్లు విస్తరించి ఉన్నాయి. ఐతే ఇప్పుడు ఈ అకేసియా చెట్లను నరికేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. సంవత్సరంలో 365రోజులు పచ్చదనాన్ని పంచుతున్న అకేషియా చెట్లను నరికేసేందుకు టీటీడీ ఎందుకు నిర్ణయించిందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అకేషియా చెట్ల వల్ల జీవ వైవిధ్యంలో మార్పులు రావడంతో పాటు, చెట్ల కింద భూసాంద్రత దెబ్బతింటోందని స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పరిశోధనలో తేలింది.
తిరుమల కొండల్లోని అకేసియా చెట్ల కింద పీహెచ్ 4.5 శాతానికి చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం కూడా ఎక్కువవుతోందని పరిశోధనలో తేలిందట. దీనికి సంబంధించి బయోడైవర్సిటీ బోర్డు నివేదిక ఇవ్వడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ చెట్లను తొలగించాలని నిర్ణయించింది. అయితే సుమారు రెండువేల ఎకరాల్లో ఉన్న అకేసియా చెట్లను నరికివేయడమంటే ఆశామాషి వ్యవహారం కాదు. కానీ అకేషియా చెట్ల వల్ల కొండల్లోని వన్యప్రాణులకు కలుగుతున్న ఇబ్బందులు, జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని గుర్తించారు టీటీడీ అధికారులు.
ఈ అంశాన్ని గత పాలక మండలి సమావేశంలో చర్చించి అకేసియా చెట్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అకేషియా చెట్లను విడతల వారీగా, సుమారు పదేళ్ల లోపు నరికేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ చెట్ల స్థానంలో పురాణాల్లో విశేషంగా వర్ణించబడిన పలు రకాల చెట్లను పెంచాలని ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం 15 నుంచి 20 రకాల మొక్కలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంపిక చేసేనట్లు తెలుస్తోంది.