కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఎవ్వరిని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలో చాలా విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. “ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్” పేరుతో ప్రముఖ డిజిటిల్ మీడియా హౌస్ లో ఇంటర్వూస్ నిర్వహిస్తూ.., ఫేమస్ అయిన తుమ్మల నరసింహ రెడ్డి కరోనా కారణంగా ఈ సోమవారం ఉదయం కన్ను మూశారు. రెండు వారాల క్రితం తన అక్క గారికి కరోనా పాజిటివ్ రావడంతో టి.ఎన్.ఆర్ హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఆయన కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తరువాత టి.ఎన్.ఆర్ అక్క గారు కోలుకున్నా.., ఆయన మాత్రం హాస్పిటల్ లో జాయిన్ కావాల్సి వచ్చింది. హాస్పిటల్ లో మొదటి మూడు రోజులు ట్రీట్మెంట్ కి స్పందించిన ఆయన శరీరం.. తరువాత సహకరించలేదు. డాక్టర్స్ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీనితో టి.ఎన్.ఆర్ కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన కోమాలోకి వెళ్లిన తరువాతనే టి.ఎన్. ఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్త బయటకి వచ్చింది. అప్పటి నుండి ప్రేక్షకులు టి.ఎన్.ఆర్ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ వచ్చారు. అయినా.. ఈ సోమవారం ఉదయం ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగిపోయింది.
తెలుగు మీడియాలో ఓ సామాన్య పోగ్రామ్ ప్రొడ్యూసర్ గా టి.ఎన్.ఆర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో తెలుగులోని టాప్ శాటిలైట్ ఛానెల్స్ పని చేశారు. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో, సీరియల్స్ ప్రయత్నాలు చేశారు. అక్కడ కొన్ని అవకాశాలు వచ్చినా.., అవేవి ఆయనకి సరైన గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. ఈ క్రమంలో ప్రముఖ డిజిటల్ మీడియా హౌస్ లో “ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్” పోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఈ ఒక్క కార్యక్రమం టి.ఎన్.ఆర్ తలరాతని మార్చేసింది. ఇండస్ట్రీలోని బడా సెలబ్రెటీస్ అంతా ఆయనకి ఇంటర్వూస్ ఇచ్చిన వారే. అలా.. టి.ఎన్.ఆర్ కి మంచి గుర్తింపు లభించింది. దీనితో.., సినిమాల్లోనూ ఆయనకి అవకాశాలు వెల్లువలా లభించాయి. ఒకానొక దశలో తనకి గుర్తింపు తెచ్చి పెట్టిన ఇంటర్వూస్ చేయడానికి కూడా వీలు లేనన్ని అవకాశాలు ఆయన్ని చుట్టూ ముట్టాయి. సరిగ్గా.., ఇలా కెరీర్ లో బిజీ అవుతున్న సమయంలో టి. ఎన్. ఆర్ అకాల మరణం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏదేమైనా టి.ఎన్.ఆర్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.