స్పెషల్ డెస్క్- ఈ విశ్వంలో మానుషుల కంటే ఇతర జీవుల సంఖ్యే ఎక్కువ. భూమి మీద, సముద్రంలో కొన్ని కోట్ల రకాల జీవులు జీవిస్తున్నాయి. సముద్రంలో ఐతే ఇక చెప్పక్కర్లేదు. మనిషికి తెలియని ఎన్నో జీవులు సముద్రంలో నివసిస్తున్నాయి. ఐతే కాల క్రమేనా చాలా రకాల జీవులు అంతరించిపోతున్నాయి. ఇందుకు పర్యావరణ సమతుల్యతే కారణమని జీవశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అంతరిచిపోయిన జీవుల్లో మనం నీటి గుర్రాల గురించి చెప్పుకోవచ్చు. సముద్రంలో నివశించే అరుదైన నీటి గుర్రం జాతి జీవులు చాలా కాలంగా ఎవ్వరికి కనిపించడం లేదు. దీంతో ఈ సీ హార్స్ అంతరించిపోయినట్లేనని భావించారు. ఐతే నీటి గుర్రాలు పూర్తిగా అంతరించిపోలేదని, కొన్ని చోట్ల ఇంకా బతికే ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది.
గ్రీస్‌లోని అయిటోలికో అనే నీటి పాయలో నీటి గుర్రాలు కనిపించాయి. ఆ నీటిపాయ అత్యంత దారుణంగా, పూర్తిగా చెత్తతో నిండిపోయి ఉంది. ఆ చెత్తలోనే నీటి గుర్రాలు నివశిస్తున్నాయి. వీటిని కొందరు డైవర్లు చూసి బయటి ప్రపంచానికి తెలిజెప్పారు.
ఆ నీటి పాయను శుభ్రం చేయకపోతే, నీటి గుర్రాలు పూర్తిగా నాశనం అయిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నీటి గుర్రాలన్నీ ఒకే ప్రాంతంలో ఉన్నాయని డైవర్లు చెప్పారు. అయిటోలికో నీటిపాయలో ఇంతకు ముందు చాలా సంఖ్యలో నీటిగుర్రాలు ఉండేవని, కానీ ప్రస్తుతం వాటి సంఖ్య చాలా తగ్గిపోయిందని స్థానిక మత్సకారులు చెబుతున్నారు.