ముంబయి- ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులకు భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగొచ్చింది. గర్భిణీ ఉద్యోగుల విషయంలో కొత్తగా జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ.
మూడు నెలలు దాటిన గర్భిణి అభ్యర్థులు విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అంతే కాదు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలలలోపు విధుల్లో చేరొచ్చంటూ గత యేడాది డిసెంబర్ 31న విడుదల చేసిన ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్య మహిళల పట్ల వివక్షతో కూడుకున్నదని జాతీయ మహిళా కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజ్యంగబద్ధమైన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేదిగా ఉందని, పైగా కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 ప్రకారం చెల్లదని అని పేర్కొంటూ ఢిల్లీ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అటు రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ విషయమై లేఖ రాశారు.
ఈ పరిణామాల నేపధ్యంలో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. అంతకు ముందు నిబంధనల మేరకు, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హులు. దానిని మారుస్తూ బ్యాంక్ సర్క్యులర్ తేవడడమే తాజా విమర్శలకు కారణమైంది. వివాదాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సర్క్యులర్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. అయినప్పటికీ ఢిల్లీ ఉమెన్ కమిషన్ ముందు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా వివరణ ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు.