తిరుపతి- సాధారణంగా రౌడీలంటే పోలీసులకు వళ్లు మండిపోతుంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, వారిని అరెస్ట్ చేసి జైల్లో పెడదామా అని పోలీసులు ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇందుకు రివర్స్ లో జరిగింది. రౌడీషీటర్స్ తో కలిసి పోలీసులు ఘనంగా న్యూఇయర్ వేడుకలను జరుపుకున్నారు. అవును మీరు చదివింది నిజమే. ఇప్పుడీ ఘటన సర్వత్రా ఆసక్తిరేపుతోంది.
తిరుపతిలో రౌడీషీటర్లు కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అది ఎక్కడో బయట ఐతే అసలు మ్యాటరే లేదు. కానీ రౌడీషీటర్లు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంది ఏకంగా పోలీస్ స్టేషన్లో.. అంతే కాదు పోలీసుల సమక్షంలోనే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఈ ఘటన తిరుపతిలోని ఈస్ట్ పోలీస్టేషన్ లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే.. తిరుపతి అర్బన్ పోలీసులు, జిల్లా పరిధిలోని స్టేషన్లలో రౌడీ షీటర్లతో కేక్ కట్ చేయించారు. ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఆదేశాలతో, పోలీసు అధికారులు దగ్గరుండి రౌడీషీటర్లతో న్యూ ఇయర్ వేడుకలు జరిపించారు. ఆ తరువాత వారికి గ్రీటింగ్ కార్డులను అందజేసి, శుభాకాంక్షలు చెప్పి ఎస్పీ ప్రత్యేక సందేశాన్ని వినిపించారు.
ఎస్పీ వెంకట అప్పలనాయుడు సందేశంలో ఏముందంటే.. గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారడానికి కొంత సమయం పడుతుందని.. అలాగే నేరాలకు పాల్పడి, గౌరవానికి దూరమవుతున్న రౌడీషీటర్లు.. ఇప్పటికైనా సీతాకోక చిలుకల మాదిరి పరివర్తన చెందాలి.. అని ఎస్పీ సూచించారు. అంతే కాదు తప్పు తెలుసుకుని.. మార్పు చెందినవారే బాధ్యత గల పౌరులుగా మారుతారని అన్నారు. నేరమయ జీవితానికి స్వస్తి పలికి, గౌరవప్రదంగా జీవించాలని ఎస్పీ నూయన సంవత్సర సందేశంలో రౌడీషీటర్లకు సూచించారు.