స్పోర్స్ట్ డెస్క్- భారత వన్డే జట్టు కొత్త కెప్టెన్, టెస్టులకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు అనూహ్య పరిణామం ఎదురైంది. తొడ కండరాల గాయం కారణంగా రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టుల సిరీస్ కు దూరమయ్యాడు. రోహిత్ శర్మను మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకవాలని వైద్యులు సూచించారు. దీంతో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్ ఆడేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయంలో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
ఈ నేపథ్యంలో భారత ఎ జట్టు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ ను టెస్టు జట్టులో చేర్చినట్టు బీసీసీఐ ప్రకటించింది. పాంచల్ ఇటీవలే దక్షిణాఫ్రికాలో ఆడాడు. వారి ఏ జట్టుపై 96 పరుగులు చేశాడు. అతన్ని సోమవారం రాత్రే జట్టు హోటల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించామని బీసీసీఐ పేర్కొంది. కానీ టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ ఎవరనేది మాత్రం బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. రోహిత్ శర్మ పని ఒత్తిడి కారణంగా ఇటీవల కివీస్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ కు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈనెల 26 నుంచి సఫారీలతో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండి 16న టీమ్ ఇండియా జట్టు సభ్యులు ముంబై నుంచి బయలుదేరుతారు. రోహిత్ శర్మ గత వారం రోజులుగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే రోహిత్ ఆదివారం తీవ్రంగా గాయపడ్డాడు. త్రోడౌన్స్ అందుకునేటప్పుడు అతడి చేతికి దెబ్బ తగిలినా బ్యాటింగ్ చేసినట్టు సమాచారం. ఈ సందర్బంగా రోహిత్ శర్మ ఎడమ తొడ కండరాలు పట్టేయడంతో సిరీస్ కు దూరమయ్యాడని తెలుస్తోంది.
ఈ ఏడాది ఆడిన 11 టెస్టుల్లో భారత జట్టు తరఫున రోహిత్ దే అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పవచ్చు. రోహిత్ శర్మ అత్యధికంగా 906 పరుగులు చేయగా, ది ఇందులో రెండు సెంచరీలున్నాయి. అంతే కాదు అత్యధిక వ్యక్తిగత స్కోరు 161 పరుగులు చేసింది కూడా రోహిత్ శర్మనే. ఇటువంటి సమయంలో రోహిత్ గాయం భారత జట్టు ఆటతీరుపై తీవ్ర ప్రభావం పడనుంది.