మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి పలు అంశాలు ఘోర రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలోని రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి.
దేశంలోని రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మద్యం తాగి వాహనం నడపడం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి పలు అంశాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. పార్వతీ పురం మన్యం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మర్చిపోక ముందే.. తమిళనాడులో గురువారం మరో ఘటన చోటుచేసుకుంది. కృష్ణగిరి జిల్లా కావేరిపట్నంలో ట్రాక్టర్‌ను మినీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు . గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెంగళూరు నుండి తమిళనాడులోని సేలంకు వెళుతున్న మినీ బస్సు ఎర్రహెల్లి గ్రామం వద్దకు రాగానే ట్రాక్టర్ ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో మూడు నెలల చిన్నారి కూడా ఉండటం విచారకరం. మృతులను ముత్తు, మల్లి, మునుస్వామి, వాసంతి, వర్షిణీ (3 నెలల పసికందు)గా పోలీసులు గుర్తించారు. వీరంతా ధర్మపురి జిల్లా సావులూర్ వాసులని పేర్కొన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారని వారిని సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ నెల 22న ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పెళ్లికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నెల 14న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందిన సంగతి విదితమే. బైక్ పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ నెల 16న తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆటో, ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ నెల 22న మహరాష్ట్రలోని పుణెలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ నెల 21న మేఘాలయలోని నార్త్ గారోహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.