తిరుపతి– ఈ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్. ఆ ఆహారం రుచిని బట్టి ఆ ప్రాంతం ప్రాచుర్యం పొందుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి బందరు లడ్డూ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, హైదరాబాద్ బిర్యానీ, అంకాపూర్ చికెన్.. ఇలా ప్రాంతాన్ని బట్టి ఒక్కో వంటకం ఫేమస్ అన్నమాట.
ఇక తిరుపతి అనగానే మనకు శ్రీవారి లడ్డు గుర్తుకు వస్తుంది. తిరుపతి లడ్డూ ప్రపంచ ప్రసిద్ది అని వేరే చెప్పక్కర్లేదు. కానీ అదే తిరుపతిలో అప్పం దోసే చాలా ప్రసిద్ది అని చాలా మందికి తెలియదు. అవును రేణిగుంట రైల్వే స్టేషన్ పక్కన గత 26 ఏళ్లుగా ఓ కుటుంబం టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ అప్పం దోసె ప్రత్యేకం. వాళ్ల ఇంటి పేరే అప్పాలు అని పెట్టేసుకున్నాంటే, ఆ అప్పం దోసె వారికి ఎంత పేరు తెచ్చిపెట్టిందో ఇట్టే తెలిసిపోతుంది.
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అప్పం ప్రసిద్ది. కాని ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రేణిగుంట అప్పం దోసె ఫేమస్. మామూలుగా చాలా టిఫిన్ సెంటర్లలో గ్యాస్ పొయ్యి ఉపయోగించే టిఫిన్ తయారు చేస్తారు. కానీ, ఇక్కడ కట్టెల పొయ్యి వాడటం వలన ఈ అప్పంకి అంత రుచి ఉంటుందని చెబుతుంటారు. రేణిగుంట వెళ్లి అప్పాలమ్మ హోటల్ ఎక్కడ అని అడిగితే చాలు ఎవరైనా చూపిస్తారు. అంత ఫేమస్ ఈ అప్పం. ఇక్కడ సాదా అప్పం, కరివేపాకు అప్పం, కారం అప్పం, కోడిగుడ్డు అప్పం.. ఇలా చాలా రకాల అప్పాలు లభిస్తాయి.
అంతే కాదు రుచికరమైన చికెన్, మటన్, పాయా, నాటుకోడి వంటి నాన్ వెజ్ కూడా అందుబాటులో ఉంటుంది. సినీ తారలు మంచు లక్ష్మీ, విష్ణు, మనోజ్ అయితే తిరుపతి వచ్చిన ప్రతిసారి ఈ అప్పం తిని తిరుపతికి వెళ్తారని హోటల్ నిర్వాహలు చెబుతున్నారు. అంతే కాదు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి తిరుపతి వెళ్లినప్పుడు ఇక్కడ అప్పం దోసె తిని వారితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. అందుకే మీరు తిరుపతి వెళ్లినప్పుడు మరిచిపోకుండా అప్పాలమ్మ హోటల్ లో ఓ అప్పం దోసే తిని వెళ్లడం మాత్రం మరిచిపోకండి.