వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బుధవారం పంజాబ్ పాఠశాలల్లో అడ్మిషన్ లేదా ట్యూషన్ ఫీజులను పెంచకూడదని ఆదేశించారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం.. రాష్ట్రంలోని వందల వేలమంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించనుంది. స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉండటం కారణంగా పిల్లలను ఒక చోట నుండి మరో చోటుకు మార్చవలసి వస్తుంది.
విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీ సామాగ్రి, యూనిఫాంలను ఫలానా దుకాణం నుంచి కొనుగోలు చేయాలని ఏ పాఠశాల కూడా తల్లిదండ్రులను ఒత్తిడి చేయరాదని సీఎం ఆదేశించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, స్టేషనరీలు, యూనిఫాంలను అందజేసేలా చూడాలని, తల్లిదండ్రులు వీటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారే ఎంచుకోవచ్చని సీఎం చెప్పారు.
ఇక వీడియో సమావేశంలో మాట్లాడుతూ.. “విద్య మూడవ కన్ను లాంటిది. ఇది విద్యార్థి దృష్టిని అభివృద్ధి చేస్తుంది. విద్య అనేది సామాన్యులకు అందుబాటులో లేకపోవడం నాకు బాధ కలిగించింది. ప్రజలు తమ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించాలని కోరుకుంటారు, కానీ అధిక ఖర్చు కారణంగా నిర్ణయాలు మార్చుకుంటారు” అని సీఎం మాట్లాడారు.
పంజాబ్ లో కొత్తగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా స్నేహపూర్వక నిర్ణయాలలో ఇది ఒకటి. మార్చి 16న సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సీఎం భగవంత్ మాన్.. అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ ను ప్రారంభించారు. 35,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వారి ఉద్యోగాలలో క్రమబద్ధీకరించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా చట్టసభ సభ్యులకు ఇచ్చే అధిక పెన్షన్‌లను తగ్గిస్తూ, రేషన్ లను ఇంటింటికి పంపిణీ చేస్తామని ప్రకటించారు. సీఎం నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి పంజాబ్ సీఎం ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తీసుకున్న ఈ నిర్ణయంఫై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.