కరోనా కష్ట కాలంలో మానవత్వం మంట కలుస్తోంది. ఎవరు ఎలా పోయినా పర్లేదు, మనం బాగుంటే చాలు అనే భావనలో కొంతమంది బతికేస్తున్నారు. వనపర్తి జిల్లా మదనాపురంలో ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే గ్రామానికి చెందిన శకుంతలమ్మ గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తూ వస్తోంది. ఆమె వయసు 80 సంవత్సరాలు. అరాకొర దూరపు బంధువులు తప్ప.., ఆమెకి సొంత మనుషులు ఎవ్వరూ లేరు. దీంతో.., ఇరుగుపొరుగునే తన వాళ్ళగా భావించి అందరితో బాగుంటూ జీవిస్తూ వచ్చింది శకుంతలమ్మ. గ్రామంలో అందరికీ మంచి చెడులు చెప్తూ.., అందరికీ జీవితం పట్ల స్ఫూర్తిని కలిగిస్తూ ఉండేది. కానీ.., ఒక వారం నుండి శకుంతలమ్మ ఆరోగ్యం క్షీణించింది. కరోనా నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా ఎవ్వరూ ముందుకి రాలేదు. తన వాళ్ళు అంటూ ఎవ్వరూ లేకపోవడంతో వారం రోజుల పాటు ఆ అవ్వ ఇంట్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి శకుంతలమ్మ శుక్రవారం కన్నుమూసింది. దీంతో.., ఈ అవ్వ అంత్యక్రియలు చేయడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు.
ఈమెకి వరుసకు కూతురైన లక్ష్మీ అనే బంధువు ఉంది. లక్ష్మీకి కూడా శకుంతలమ్మ అంటే చాలా ఇష్టం. ఎలా అయినా శకుంతలమ్మకి అంత్యక్రియలు చేయించాలని లక్ష్మీ తన భర్తని వేడుకుంది. కానీ.., ఆ భర్త మనసు కరగలేదు. మనకి ఎందుకు వచ్చిందని అతను అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో.., అనాధ అవ్వ శకుంతలమ్మ మరణ వార్త పోలీసుల వరకు చేరింది. సరిగ్గా ఇక్కడే వనపర్తి పోలీసులు తమ మానవత్వం చాటుకున్నారు. లాఠీ కాఠిన్యం వెనుక కారుణ్యం ఉందని, మనసున్న మనుషులమని చాటి చెప్పారు. ఆఖరి మజిలీకి నోచుకోని ఆ వృద్ధురాలికి అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి మన్ననలు పొందారు. ఎస్ఐ తిరుపాజి చొరవతో ఈ కార్యక్రమం జరిగింది. దహన సంస్కారాలకు కావాల్సిన సామగ్రిని పోలీసులే సమకూర్చుకోవడం విశేషం. ఎస్ఐ, ట్రెయినీ ఎస్ఐ రాజశేఖర్, ఐదుగురు కానిస్టేబుళ్లు పాడెను మోసి..అంత్యక్రియలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది కురుమయ్యగౌడ్, రవి, శివకుమార్రెడ్డి, స్వాములు, కలాం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వనపర్తి పోలీసులు చేసిన ఈ పనితో.. అన్నీ వర్గాల నుండి పోలీసులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చూశారు కదా? ఖాకీల కాఠిన్యం వెనుక ఎంతటి మానవత్వం ఉంటుందో. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
