న్యూ ఢిల్లీ- దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేల ఆజాది అమృత్ మహోత్సవం జరుపుకుంటుంటున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పిన ప్రధాని, దేశంలో కరోనా టీకా లేకపోతే ఏమి జరిగి ఉండేదో మీరు ఊహించుకోండని అన్నారు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నా, విభజన నాటి ఆవేదన ఇప్పటికీ భారతదేశ ఛాతీని చీల్చుతోందని ప్రధాని మోదీ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. గడిచిన వందేళ్లలో జరిగిన పెద్ద విషాదాలలో ఇదీ ఒకటని మోదీ అన్నారు. ఆగస్టు 14 ను విభీషణ స్మారక దినంగా గుర్తుంచుకుందామని, ఈమేరకు దేశం భావోద్వేగ నిర్ణయం తీసుకుందని ప్రధాని తెలిపారు.
కరోనా మహమ్మారి విజృంభన సమయంలో వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వ్యాక్సిన్ కంపెనీలు ప్రజలకు నిరంతర సేవలు అందించారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరికీ మోదీ కృతజ్ఞతలు చెప్పారు. దేశం స్వాతంత్ర్య శతాబ్దికి దగ్గరవుతున్న వచ్చే ఈ 25 సంవత్సరాల ప్రయాణం నేటి నుంచే ప్రారంభమవుతుందని, ఇది కొత్త భారతదేశ సృష్టికి అమృత కాలమని ప్రధాని అభివర్ణించారు.
ఈ 25 ఏళ్ల సమయం మనం భవిష్యత్తులో తీసుకునే ఉన్నత లక్ష్యాలు మనల్ని 100 సంవత్సరాల స్వాతంత్ర్యానికి తీసుకువెళతాయని ప్రధాని మోదీ చెప్పారు. దేశ పౌరులకు శ్రేయస్సు నందిస్తూ, దేశాన్ని నూతన శిఖరాలను అధిరోహించడమే అమృత్ కాల్ లక్ష్యం అని మోదీ పేర్కొన్నారు. దేశంలోని గ్రామాలు మొదలుకొని, పట్టణాలు, నగరాల వరకూ అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని వ్యాఖ్యానించారు.