న్యూ ఢిల్లీ- ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన సిరివెన్నెల వారం రోజుల పాటు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోది సహా సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఇదిగో ఇప్పుడు సిరివెన్నెల మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వారి కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. ఆయన ఫ్యామిలీకి ప్రధాని సానుభూతి తెలియజేశారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని మోదీ ఆకాంక్షించారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.
సిరివెన్నెల కుటుంబానికి ప్రధాని రాసిన లేఖలో ఏమన్నారంటే.. శ్రీమతి పద్మావతిగారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణించడం చాలా బాధాకరం.. తీవ్ర దుఃఖంతో ఉన్న మీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను.. బహుముఖ కవి, శాస్త్రి తన స్వరకల్పనల ద్వారా ఆ కాలంలోని సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా విస్తృతంగా ప్రసిద్ది చెందారు.. సిరివెన్నెల తెలుగు భాషపై పట్టు కలిగిన వ్యక్తే కాదు.. పదం పట్ల భావాన్ని కలిగి ఉన్న వ్యక్తి కూడా.. అని పేర్కొన్నారు.
సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సహకారానికి పద్మశ్రీ లాంటి అవార్డు పొందారు.. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.. అంటూ మోదీ భావోద్వేగ లేఖను రాసారు. అటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాదన్ కూడా సిరివెన్నెల ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.