ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అంటే ఒక మెషిన్. అది గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తుంది. ఈ ఆక్సిజన్‌ను ముక్కులోకి వెళ్లే ట్యూబ్ ద్వారా తీసుకుంటారు. దీన్నుంచి అందే ఆక్సిజన్ 90 నుంచి 95 శాతం స్వచ్ఛంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకలకోసం జనం నానా ఇబ్బందులూ పడుతూ, ఆక్సిజన్ లేక రోడ్లపైనే చనిపోతున్న సమయంలో వారి ప్రాణాలు కాపాడ్డానికి ‘ఆక్సిజన్ కాన్సంట్రేటర్’ ఎక్కువగా వినియోగిస్తుంటారు. రోగులకు ఇంట్లోనే వీటిని ఏర్పాటు చేస్తే పదేపదే ఆసుపత్రులకు రావాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఆసుపత్రుల్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు. అంతకుముందు ఇవి పెద్దగా ప్రచారంలో లేవు. అయితే ఇప్పుడు కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరత ఎక్కువవుతుండటంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి డిమాండ్ భారీగా పెరిగింది.

కరోనా విలయతాండవం చేస్తుండటంతో ప్రజల అవసరాన్ని, భయాన్ని సొమ్ము చేసుకుంటూ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విక్రయించే కంపెనీలు, డీలర్లు అడ్డగోలుగా ధరలు పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.30-40 వేలుండే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ధరని ఇప్పుడు రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు పెంచేశారు. ఇది నిమిషానికి ఐదు లీటర్ల సామర్థ్యం గల కాన్సంట్రేటర్ ధర మాత్రమే. 10 లీటర్ల సామర్థ్యంగలదైతే రూ.1.50 లక్షలకుపైనే ధర పలుకుతోంది. కొన్ని పెద్ద కంపెనీల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. కొందరైతే చైనా నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని నాసిరకం కాన్సంట్రేటర్లనూ ఎక్కువ ధరకు అంటగడుతున్నారు. అమెజాన్ వంటి ఇ-కామర్స్ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 40వేల పైనే ఉంది. డిమాండ్‌ను బట్టి ధర పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఆక్సిజన్ సిలిండర్లతో పోలిస్తే కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కాన్సంట్రేటర్లతో ప్రతికూలతలూ కూడా ఉన్నాయి. ఇందులో పీడనం కలిగిన ఆక్సిజన్ ఉండదు కాబట్టి.. ప్రతిసారీ ఆక్సిజన్ విడుదల చేయాలంటే కాన్సంట్రేటర్ తప్పనిసరిగా బ్యాటరీ లేదా విద్యుత్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. పవర్ ఉంటే గాలిని ఫిల్టర్ చేసి, సరఫరా చేయడానికి కుదురుతుంది. అంతేగాక, దీని పనితీరు కాస్త సంక్లిష్టంగా ఉండటం కూడా ఒక్కోసారి గందరగోళానికి గురిచేస్తుంది.
