భాగ్యనగరంలో ఈ మధ్య ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘సన్ డే-ఫన్ డే’, ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు నగర పురపాలక శాఖ ప్రకటించింది. ‘సన్ డే-ఫన్ డే’ అనేది ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తుండగా.. ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం పాతబస్తీలోని చార్మినార్ వద్ద నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై క్లారిటీ వచ్చేవరకు ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సన్ డే-ఫన్ డే – ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమాలకి నగర వాసుల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది. ప్రతి వారం ప్రత్యేక షోలతో ఈ కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నిజానికి ‘సన్ డే-ఫన్ డే’ ప్రోగ్రాంలాగే చార్మినార్ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని భావించి.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు చార్మినార్ వద్ద ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా చార్మినార్ లైటింగ్ తో పాటుగా ఫుడ్ కోర్టులు జనాల నుండి బాగా ఆదరణ పొందాయి. ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే పురపాలక శాఖ అందించిన తాజా ఆదేశాల మేరకు ఈ రెండు కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.