ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు. ఏ వయసులోనైనా, ఎవ్వరితోనైనా ప్రేమ చిగురించవచ్చు. రెండు మనసులు ఇష్టపడటమే ముఖ్యం. అలా ప్రేమలో పండిందీ ఓ వృద్ధ జంట. చివరికీ అందరి సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కింది.
ప్రేమ ఎప్పుడు, ఏ వయసులో, ఎవ్వరితో, ఎందుకు, ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమలో ఉన్నవారికి సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. ప్రేమకు వయస్సుతో పనిలేదు. ఈ సమయంలోనే వీరి మీదే ఎందుకు ప్రేమ చిగురిస్తుందో అనేందుకు సరైన కారణాలు లేవు. తండ్రి వయస్సు ఉన్న వ్యక్తులతో అమ్మాయిలు ప్రేమలో పడుతుంటే.. తన కన్నా ఐదారేళ్లు పెద్దదైన మహిళల ప్రేమిస్తున్నారు నేటి యువకులు. మలి వయసులో కూడా మరో జీవితానికి ఆహ్వానం పలికిన వారున్నారు. అదే నిజమని నిరూపించిందో వృద్ధుల జంట. ఈ వివాహం వైరల్ గా కూడా నిలిచింది.
మహారాష్ట్రలో చిగురించిందీ ఈ వృద్ధ ప్రేమ. కొల్హాపుర్‌లోని శివ్ నాక్వాడిలో నివసించే బాబురావ్ పాటిల్ కు 75 ఏళ్లు కాగార, వాఘోలీ ప్రాంతానికి చెందిన అనసూయ షిండేకు 70 ఏళ్లు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమకు వేదికైంది జానకీ ఓల్డ్ ఏజ్ హోమ్. భాగస్వాములు చనిపోవడంతో శిరోల్ తాలూకాలోని ఘోసర్వాడ్ ప్రాంతంలో ఉన్న ఈ వృద్ధాశ్రమంలో రెండేళ్ల నుండి ఈ ఇద్దరు ఉంటున్నారు. ఆ క్రమంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అన్ని విషయాల గురించి మాట్లాడుకునే వారు. జీవితంతో ఎదుర్కొన్న సుఖ దు:ఖాల గురించి చర్చించుకున్నారు. అలా వారి పరిచయం ప్రేమకు దారి తీసింది.
ఈ సమయంలో ఒకరి తోడు మరొకరికి అవసరమని అనిపించింది. ఈ విషయం వృద్ధాశ్రమంలోని సిబ్బంది గుర్తించారు. ఆశ్రమంలో డ్రైవర్ గా పనిచేసే బాబా సాహెబ్ వీరి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. న్యాయపరమైన ప్రక్రియ కూడా ఆయనే పూర్తి చేశారు. సాక్షి సంతకం కూడా పెట్టారు. ఎక్కడైతే ప్రేమ పుట్టిందో అదే జానకీ ఓల్డ్ ఏజ్ హోమ్ వివాహ వేదికైంది. వృద్ధ దంపతులు వధూవరులుగా మారి.. వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ప్రేమకు, పెళ్లికి వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఈ వృద్ధ జంట కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.