ఆమెకు చిన్నప్పటినుంచి ఆ దేవుడంటే ఎంతో ఇష్టం. ఆ దేవుడ్నే తన భర్తగా ఊహించుకోసాగింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలన్న కోరికను తన తల్లిదండ్రుల ముందు పెట్టింది. మొదట ఆశ్చర్యపోయినా.. వారు ఆమె పెళ్లికి ఒప్పుకున్నారు.
దేవుళ్లను తమ భర్తలుగా ఊహించుకున్న వారు మన చరిత్రలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మీరాబాయి ఒకరు. ఈమె తన చిన్నప్పటినుంచి శ్రీకృష్ణుడినే తన భర్తగా అనుకుంది. కృష్ణుడిపై ఎన్నో రచనలు చేసింది. అయితే, మీరా భాయికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు ఆమెకు భోజ్‌రాజ్ అనే వ్యక్తితో వివాహం చేశారు. ఇది 1500 కాలానికి చెందిన కథ. అప్పట్లోనే ఆమె దేవుడి కోసం జీవిస్తాను అంటే ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ, ఈ 21వ శాతాబ్ధంలో ఓ తండ్రి ధైర్యం చేశాడు. కూతురి కోరికను తీర్చాడు. తన కూతురికి కృష్ణుడి విగ్రహంతో పెళ్లి జరిపించాడు.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఓరాయాకు చెందిన 30 ఏళ్ల రక్ష పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చేస్తోంది. ఆమెకు చిన్నప్పటినుంచి కృష్ణుడంటే అమితమైన భక్తి. ఆ భక్తి తర్వాతి కాలంలో ప్రేమగా మారింది. ఇక, అప్పటినుంచి శ్రీకృష్ణుడినే తన భర్తగా ఊహించుకోసాగింది. శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. గత జులై నెలలో తాను శ్రీకృష్ణుడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తన తల్లిదండ్రులకు తెలిపింది. కూతురి కోరికను విని వారు మొదట షాక్‌కు గురైనా..
తర్వాత ఆమె మనసును అర్థం చేసుకున్నారు. పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు. తాజాగా, రక్ష పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బంధు మిత్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్షకు కృష్ణుడి విగ్రహంతో పెళ్లి జరిపించారు. దీనిపై రక్ష మాట్లాడుతూ.. ‘‘ శ్రీ కృష్ణుడు తరచుగా నా కల్లోకి వచ్చేవాడు. ఓ రెండు సార్లు నా మెడలో దండకూడా వేశాడు’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక దేశ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. మరి, దేవుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకున్న రక్షపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.