ఒడిశా రైలు ప్రమాద ఘటనలో పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించి వారు చెప్పారంటే?
ఒడిశాలోని కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై యావత్ ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికి దాదాపుగా 280 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై స్పందించి శనివారం ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ తో పాటు ప్రధాని నరేంద్ర మోడి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలతో బయటపడ్డారు. కోరమాండల్ రైలు ప్రమాద ఘటనలో పశ్చిమ బెంగాల్ కు చెందిన సుబ్రోతో పాల్, దేబోశ్రీ పాల్, దంపతులతో పాటు వీరి కుమారుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన అనంతరం వీళ్లు మీడియాతో మాట్లాడుతూ అసలు నిజాలను వివరించే ప్రయత్నం చేశారు.
ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే?
మేము మా కొడుకుని డాక్టర్ కోర్సు చదివించాలని అనుకున్నాం. ఇందులో భాగంగానే చెన్నై వెళ్లడానికి యశ్వంతపుర్ రైలు ఎక్కాం. మేము ప్రయాణిస్తున్న రైలు ప్రమాదానికి గురైంది. వెంటనే మేము ఆ రైలు నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేశాం. కానీ, ఆ సమయంలో కంపార్ట్ మెంట్లలో పూర్తిగా పొగ నిండిపోయింది. అప్పుడు మాకు ఏం కనిపించలేదు. ఇక ఎలాగో కష్టపడి ముగ్గురం బయటకు వచ్చాం. ఆ తర్వాత మేము ముగ్గురం కలుసుకోవడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. అయితే, మేము బయటకు రాగానే ఆ సమయంలో కనిపించిన దృశ్యాలు మాత్రం ఇప్పటికీ మా కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదం నుంచి మేము ప్రాణాలతో బయటపడడం అనేది రెండవ జన్మగా భావిస్తున్నామని ఆ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.