పెళ్లిళ్లలో గొడవలు కామన్. అలకలు, బుజ్జగింపులు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ వివాహాల్లో ఒక భాగంగా మారాయి. అయితే ఆ జంట మాత్రం తమ మ్యారేజ్‌లో ఎలాంటి గొడవలు జరగకూడదని ఫిక్స్ అయింది. ఈ క్రమంలో వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్‌ను వినూత్నంగా రూపొందించింది.
ఎవరి జీవితంలోనైనా పెళ్లి అనేది ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక. ఎప్పటికీ గుర్తుండిపోయే వేడుక కాబట్టే డబ్బుకు కూడా వెనుకాడకుండా ఘనంగా ప్లాన్ చేసుకుంటారు. ఇక, పెళ్లింట్లో ఉండే సందడి, సంతోష, వినోదం.. అంతా వేరే లెవల్. ఇరు వర్గాలకు చెందిన కుటుంబీకులు, బంధువులు, మిత్రులు హాజరవుతుంటారు. రుచికరమైన వెరైటీ భోజనాలు ఎలాగూ ఉంటాయి. కొన్ని చోట్ల పెళ్లి అయిన తర్వాత డ్రింక్ పార్టీలు కూడా ఉంటాయి. అయితే వివాహాల్లో చిన్న చిన్న భేదాభిప్రాయాలు, అలకలు, గొడవలు వంటివి సాధారణం. ఇవే ఒక్కోసారి పెరిగి పెద్దగా అవుతాయి. దీంతో గుజరాత్‌కు చెందిన ఓ జంట ముందుచూపుతో ఆలోచించి గొడవలు లేకుండా ప్లాన్ చేసింది.
పెళ్లిలో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా జరగాలనే ప్లాన్‌తో వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా తయారు చేశారు. తమ పెళ్లికి మందు తాగిన వారు హాజరు కావొద్దంటూ శుభలేఖలో పేర్కొన్నారు. గుజరాత్ రాజ్‌కోట్‌లోని హడలా గ్రామానికి చెందిన మన్సుక్ సీతాపర అనే వ్యక్తి కూతురి పెళ్లి గురువారం జరిగింది. ఈ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్లో ముందుగానే పైసూచన చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారింది. ఇటీవల అదే గ్రామంలో జరిగిన ఓ పెళ్లిలో ఇద్దరు అతిథులు తాగి గొడవపడ్డారట. ఆ వివాహం ఆగిపోయిందట. తమ మ్యారేజ్ విషయంలో అలా జరగుతుందేమోననే భయంతో ఇలా చేశారట. మరి.. ఈ వినూత్న వివాహ ఆహ్వాన పత్రిక ఐడియా ఎలా ఉందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.