కొన్ని ప్రభుత్వం ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు ఉండవు. అక్కడికి చికిత్స కోసం వెళ్లే రోగులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. వాటి అభివృద్ధి గురించి, సమస్యల గురించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించినా స్పందన ఉండదు. విద్యుత్ అంతరాయంతో ఆపరేషన్ థియేటర్లో సెల్ ఫోన్ వెలుగులో వెైద్యులు చికిత్స చేసిన అనేక ఘటనల గురించి మనం విన్నాం. అయితే అదే అనుభవం ఓ మంత్రికి జరిగింది. సదరు మంత్రికి దంత చికిత్స చేస్తుండగా ఆసుపత్రిలో కరెంట్ పోయింది. దీంతో వైద్యులు సెల్ ఫోన్ వెలుగులో చికిత్స చేశారు. ఈఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు ఆ రాష్ట్ర మంత్రి సందీపన్ భుమ్రే వెళ్లారు. ఈక్రమంలో అక్కడి వైద్యులతో భుమ్రే దంత పరీక్షలు చేయించుకున్నారు. మంత్రిని పరీక్షించిన వైద్యులు.. రూట్ కెనాల్ చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే మంత్రి ఏమనుకున్నారో ఏమో కానీ.. వెంటనే చికిత్స ప్రారంభించాలని వైద్యులను కోరారు. ఇక మంత్రి కోరిక మేరకు వైద్యులు ఆయన దంతాలకు చికిత్స చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రికి ఆపరేషన్ చేస్తుండగా.. కరెంట్ పోయింది. దీంతో ఆపరేషన్ గది ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. మంత్రికి చికిత్స మధ్యలోనే ఉంది. ఇక ఏమి చేయాలో అర్థంకానీ వైద్యులు కరెంట్ కోసం కొంత సమయం వేచి చూశారు.
చివరకు తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ వెలుగుల్లో వైద్యులు చికిత్సను పూర్తి చేశారు. తరచు ఇలానే కరెంట్ కట్ అవుతుందని, జనరేటర్ కావాలని కొంతకాలంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. తనకు జరిగిన స్వీయ అనుభవంతో వెంటనే స్పందించిన మంత్రి సందీపన్ నిధులు మంజూరు చేయాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. అయితే ఇక్కడ మరొక టాక్ వినిపోస్తోంది. మంత్రి వచ్చినదే అదునుగా భావించి..కావాలనే విద్యుత్ నిలిపివేశారని స్థానికులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఏమైతేనే మంత్రిగారికి జరిగిన అనుభవంతో దెబ్బకు ఆ ఆసుపత్రికి నిధులు మంజురూ అయ్యాయి.