భార్యాభర్తల బంధం అనే చాలా పవిత్రమైనది. ఏ సంబంధం లేని రెండు మనస్సులు పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. అయితే ఈ బంధం కలకాలం హాయిగా సాగాలంటే… ఇద్దరిలో సర్ధుకుపోయే గుణం ఉండాలి. అలా ఉన్న దంపతులు మాత్రమే జీవితాతం హాయిగా జీవించగలరు. అయితే నేటికాలంలో సర్ధుకుపోయే గుణం దంపతుల్లో కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. అయితే సహనానికి పెట్టింది పేరుగా ఉన్న భార్యలు సైతం ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి భర్తతో గొడవపడుతున్నారు. భర్త ఆర్థికస్థితిని అర్ధ చేసుకుని కొందరు భార్యలు గొడవలకు దిగుతుంటారు. చీర కొనివ్వలేదని, సినిమాకు తీసుకెళ్లలేదని.. ఇలా చిన్న విషయాలకు భర్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్తున్నారు. ఇంకొంతమంది విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. తాజాగా మేకప్ కోసం భర్త డబ్బులు ఇవ్వలేదని కోపంతో విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది ఓ భార్య. మేకప్ కోసం విడిపోవడం ఏంటని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ మహిళ(25)కు ఢిల్లీలో నివాసం ఉండే అమిత్ అనే వ్యక్తితో 2015లో వివాహం జరిగింది. పెళ్లై రెండు సంవత్సరాల పాటు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఒకరిపై మరొకరు ఎనలేని ప్రేమను చూపించుకున్నారు. అయితే పెళ్లై ఏళ్లు గడుస్తున్న వీరికి పిల్లలు లేరు. దీనికి తోడు వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలం నుంచి ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. పెద్దలు ఎంత సర్థి చెప్పిన ఈ దంపతులు ఇద్దరు మనస్సు మార్చుకోలేదు. పెద్దల మాటలకు అమిత్ మనస్సు మార్చుకుని భార్యతో కలిసి ఉండేందుకు సిద్ధమయ్యాడు.
అయితే అతడి భార్య మాత్రం అందుకు ససేమిరా అంది. ఈక్రమంలోనే అలీగఢ్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ మహిళ పిటిషన్ వేయడం ఎవరికి ఆశ్చర్యం అనిపించలేదు. కానీ అందులో పేర్కొన్న ఫిర్యాదులే ఇరువురి కుటుంబ సభ్యులను షాక్ కి గురి చేశాయి. తన భర్త.. మేకప్ కోసం డబ్బులు ఇవ్వడటం లేదని, అలానే తన ఇంటి ఖర్చులకు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వట్లేదని, అందుకే అతడి నుంచి విడాకులు ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొంది. అంతేకాక అతడి నుంచి రూ.కోట్లలో పరిహారం ఇప్పించాలని అలీగఢ్ ఫ్యామిలీ కోర్టును సదరు మహిళ కోరింది. ఈ పిటిషన్ పై కోర్టు కౌన్సిలెర్ ప్రదీప్ సరస్వత్ స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. “భార్యాభర్తలను కోర్టులో కౌన్సిలింగ్ కు పిలిచాం. ఇద్దరినీ ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాము. అయినా వారిద్దరు కలిసి జీవించేందుకు సిద్ధంగా లేరు. ఈక్రమంలోనే వారిద్దరికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చాము. జనవరి నెలలో మరోసారి వీరిద్దరికి కౌన్సిలింగ్ జరగనుంది. వాళ్లను కలిసి ఉండేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తాం” అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాశంగా మారింది. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఇలా చిన్న చిన్న విషయాలకు దంపతులు విడాకులు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.