ఈ మధ్యకాలంలో కోర్టులు ఇచ్చే తీర్పులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. గతంలో సుప్రీ కోర్టు, హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పౌరులను షాక్ కి గురి చేశాయి. మరీ ముఖ్యంగా అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన విషయాల్లో కోర్టులు అనేక సంచలన తీర్పులను వెల్లడించాయి. అదే విధంగా భార్యల పట్ల అతిగా ప్రవర్తించే భర్తలకు కూడా హైకోర్టు అక్షింతలు వేస్తూ ఉంటుంది. భార్యపై భౌతిక దాడి, సొమ్ము కోసం వారిని వేధించడం వంటి విషయాల్లో కోర్టులు చాలా కఠినంగా ఉంటున్నాయి. తాజాగా ఢిల్లీ హైకోర్టు భార్యాభర్తలకు సంబంధించి ఓ కీలక తీర్పు ఇచ్చింది. పెళ్లాం నగలపై భర్త కన్నేస్తే నేరమేనని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మరీ.. కోర్టు ఈ తీర్పు ఇవ్వడం వెనుక ఉన్న అసలు సంగతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెళ్లి అనే పవిత్రమైన వేడుకతో రెండు మనస్సులు ఒకటవుతాయి. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. అందుకే భార్యాభర్తల వస్తువుల విషయంలో నీది, నాది అనే బేధం ఉండదు. అయితే తమ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఇతర సమస్యలతో పాటు ఆర్ధిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటుంటారు. ఆర్థిక సమస్యల విషయంలో భార్యలు.. భర్తలకు మద్దతుగా ఉంటారు. అప్పుడప్పుడు కుటుంబ అవసరానికి తమ నగలను సైతం తాకట్టు పెట్టడం లేదా అమ్మడం చేస్తుంటారు. అయితే కొందరు భర్తలు.. తమ భార్యల సొమ్మును వృథగా ఖర్చు చేస్తుంటారు. ఈ క్రమంలో దంపతుల మధ్య వివాదం జరిగి కోర్టు మెట్లు ఎక్కుతారు.
అలా ఇటీవల ఓ మహిళ తన నగలు దొంగతనం చేశాడని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ బాధితురాలి భర్త ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ నగలను ఆమె వ్యక్తిగత ఆస్తిగా కోర్టు పేర్కొంది. భర్త అయినా సరే.. భార్య అనుమతి లేకుండా నగలు తీసుకోవడం తప్పేనని హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. భార్య నగల చోరీ కేసులో భర్తకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ అమిత్ మహాజన్ సారథ్యంలోని డివిజన్ బెంచి ఈ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈకేసులోనే కోర్టు మరికొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
భర్త తన భార్యను అత్తింటి నుంచి వెళ్లగొట్టడం, అలానే భార్య నగలను అపహరించి తీసుకెళ్లడం చేయరాదని కోర్టు తన ఉత్తర్వల్లో పేర్కొంది. ఈ కేసు విచారణలో నిందితుడు.. అధికారులకు సహకరించడం కానీ, చోరీకి గురైన నగలను తిరిగి స్వాధీనం చేయడం కానీ జరిగినట్లు తమ దృష్టికి రాలేదని న్యాయమూర్తి వ్యాఖ్యనించారు. ఇలాంటి పరిస్థితుల్లో సదరు మహిళ భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని, అలానే పిటిషన్ ను కూడా రద్దు చేయలేమని ధర్మాసనం తెలిపింది. మరి.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.