‘ఈ బస్సు మనందరిది. దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనిద్దాం’ అని కొటేషన్స్ మనం చదివాము కదా. మరి ఈ భూమి అందరిదీ. అందులో మనుషులతో పాటు మిగతా ప్రాణులు కూడా ఉన్నాయి. వాటికి కేటాయించిన అడవుల్లో వాటిని ఉండనిద్దాం. ఈ భూమిని పరిశుభ్రంగా ఉంచుదాం’ అని ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే ఇవాళ పులులు, ఏనుగులు వంటి జంతువులు రోడ్ల మీదకు ఎందుకొస్తాయి? ఒక పక్క అభివృద్ధి పేరుతో అడవుల్ని కబ్జా చేసేసి.. ఇళ్ళు కట్టేసుకుంటున్నాం. మరోపక్క అవసరాల కోసమని చెట్లను నరికేస్తున్నాం. విపరీతమైన కాలుష్యంతో ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం. ఇన్ని చేస్తే అడవిలో జంతువులకి ఫుడ్డు ఎలా దొరుకుద్ది? అందుకే అవి అప్పుడప్పుడూ ఆహారాన్ని వెతుక్కుంటూ అడవులు దాటి రోడ్ల మీదకు వస్తుంటాయి.
అలా వచ్చిన వాటిని ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు అరెస్ట్ చేసి ఫారెస్ట్ జూలలో వదిలేస్తారు. అప్పుడు వాటి ఫీలింగ్ ఏంటో తెలుసా? “రేయ్ ఎవర్రా మీరంతా? నేను మీ దగ్గరకి రాలేదురా. మీరే మా దగ్గరకి వచ్చారు. ఇది ఒకప్పుడు మాదిరా.. మీ అవసరాల కోసం కబ్జా చేశారు” అని అనుకుంటాయి. మూగ జీవాలు కదా.. మన లాంటి శవాలకు అర్ధం కాదు. అసలు మేటర్ లోకి వెళ్తే.. ఒక ఏనుగు అడవుల్లోంచి రోడ్డు మీదకు వచ్చి రువాబు చేసింది. కేఎస్ఆర్టీసీకి చెందిన బస్సుని 8 కిమీల పాటు వెంటాడింది. ‘వెళ్తావా? లేదా? నడు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో. ఇది నా ఏరియా. ఇంకోసారి వస్తే తిత్తి తీస్తా’ అన్నట్టు ఆ ఏనుగు బస్సుని అదే పనిగా వెంటాడుతూ ఉంది.
కేరళలోని చలకుడి పట్టణ సమీపంలో వల్పరై హిల్ స్టేషన్ రూటులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రహదారిలో వెళ్తుండగా ఒక ఏనుగు ఒక్కసారిగా అడ్డు వచ్చింది. బస్సు మీదకి వస్తుండడంతో.. డ్రైవర్ భయపడి.. బస్సుని రివర్స్ గేరులో వెనక్కి పోనిచ్చాడు. అలా 8 కిలోమీటర్ల పాటు ఆపకుండా బస్సుని రివర్స్ గేరులోనే పోనిచ్చాడు. 40 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు.. అడవి రోడ్డు మీదుగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలోనే ఇలా ఏనుగు అడ్డుకుని వెంటాడింది. అంబలపర నుంచి అనక్కయం వరకూ ఆ ఏనుగు వెంటాడింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు భయపడ్డారు. రివర్స్ గేరులో పోనివ్వడం తప్ప వేరే దారి లేదని అన్నారు.
ఈ ఏనుగు ఇలా రోడ్డు మీదకి వచ్చి రువాబు చేయడాన్ని గత రెండేళ్లుగా చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా టైటిల్ నే ఆ ఏనుగుకి పెట్టినట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆ ఏనుగు.. ఆ రోడ్డుని తన హక్కుగా భావిస్తుంది. జంతువుల కోసం కేటాయించబడిన అడవుల మధ్య కూడా రోడ్లు వేసుకుంటూ పోతే ఫలితం ఇలానే ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాహనాల వల్ల వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం వస్తుందని.. దాని వల్ల అడవి ఎక్కడ కలుషితమైపోతుందోనన్న భయంతో ఆ ఏనుగు అలా చేసి ఉండవచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Kerala: A video of a bus being chased by a wild #elephant has gone #viral. The driver of the bus took to reverse the vehicle for about 8km to take control of the situation. WATCH 👇https://t.co/DKzvsZ4vnZ#News #Wild #India #WildAnimal pic.twitter.com/HtiTIc9O18
— Free Press Journal (@fpjindia) November 16, 2022