గురువు దైవంతో సమానం. ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక గురువు ఉంటాడు. పరిస్థితి ఏదైనా తన విద్యార్థులు చక్కగా చదువుకొని.. ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆ గురువు కోరుకునేది. అలాంటి గురువు చివరి క్షణాల్లో చేసిన పని అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మనల్ని మృత్యువు చేరువవుతోంది అని ముందే తెలుస్తుందా? చివరి క్షణాల్లో మనకు ఏం జరగబోతోందో తెలుస్తుందా? అది నిజం అని సమర్థించలేము.. అబద్ధం అని కొట్టిపారేయలేము. ఆ టీచర్‌కు ముందే తెలిసింది తనకు చివరి క్షణాలు దగ్గర పడ్డాయి అని. తన విద్యార్థులు అందరినీ కళ్లార చూసుకుని కన్ను మూసింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలోని కేసర్ ఘడ్‌లో 47 ఏళ్ల మ్యాథ్స్ టీచర్ మాధవి పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు చెప్తున్నారు. క్లాస్ చెప్తున్నంతసేపు ఏదో తెలియని అలసట, ఆయాసంగా అనిపించింది. కానీ అలాగే క్లాస్ కంటిన్యూచేశారు. పిల్లలకు హోం వర్క్ కూడా ఇచ్చారు. ఆయాసం ఎక్కువ కావడంతో పిల్లలు అందరినీ కెమెరాలు ఆన్ చేయాల్సిందిగా సూచించారు. ‘పిల్లలు అందరూ కెమెరా ఆన్ చేసి మీ ముఖాలు చూపించండి. నేను రేపు ఉంటానో లేదో తెలీదు. అందరూ హోమ్ వర్క్ చేయండి. అందరూ బాగా చదువుకోండి. మీరందరూ మంచి స్థాయిలోకి రావాలి. నేను ఎక్కడున్నా నా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి’ అంటూ టీచర్ కుప్పకూలింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మాధవి చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. పిల్లలు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పిల్లలను ఎలా సముదాయించాలో కూడా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. ఆ వీడియోను పాఠశాలలో ప్లే చేసి అందరూ బోరున విలపించారు.