ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎంతో ముందుకు సాగుతుంది. మనిషి భూమిపైనే కాదు.. అంతరిక్షంలో కూడా ఎన్నో ప్రయెగాలు చేస్తున్నారు. వైద్య రంగంలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు సాధిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ప్రపంచం ఎంత శాస్త్రపరిజ్ఞానంతో ముందడుగు వేస్తున్నా.. ఇప్పటికీ కొంత మంది మూఢవిశ్వాసాలు నమ్ముతూనే ఉన్నారు. మంత్రాలకు చింతకాలు రాలవు అని ఎన్నోసార్లు నిరూపించబడినా.. ఇంకా దొంగ బాబాలను నమ్ముతూనే ఉన్నారు. చనిపోయిన భార్య సజీవంగా తిరిగి వస్తుందని ఓ భర్త తన కుమారులతో పూజలు, ప్రార్ధనలు చేశారు.. పోలీసులు కలుగజేసుకొని చివరికి అంత్యక్రియలు జరిపించేలా చేశారు. ఈ ఘటన మధురైలో జరిగింది.
మదురై కి చెందిన బాలకృష్ణన్ తన భార్యా.. ఇద్దరు కుమారులతో జీవిస్తున్నారు. కొంత కాలంగా బాలకృష్ణన్ ఓ హూటల్ లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన భార్య మాలతి అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి ఎన్నో ఆసుపత్రులు తిరిగినా ఆమెకు నయం కాలేదు.. ఈ మద్యనే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మదురై లోని ఓ హాస్పిటల్ లో ఈ నెల 8న కన్నుమూసింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చిన బాలకృష్ణన్ ఐస్ బాక్స్ లో భద్రపరిచి ఉంచారు. అయితే బాలకృష్ణన్ అంత్యక్రియలు చేయకపోవడంపై చుట్టుపక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి రాగా కొంత మంది బంధువులు రావాల్సి ఉంది.. అందుకే కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయని బుకాయించాడు బాలకృష్ణన్.
మూడో రోజు కూడా అంత్యక్రియలు జరిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు మరోసారి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఇంటికి చేరుకోగా.. తన ఇంట్లోకి రావొద్దని.. వస్తే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించాడు బాలకృష్ణన్. ఎలాగో అలా అతని బంధువులను రప్పించి.. చర్చీ ఫాదర్ తో ఆ మృతదేహం వద్ద ప్రార్థనలు జరిపించి అంత్యక్రియలు పూర్తయ్యేలా చేశారు.
పోలీసుల విచారణలో బాలకృష్ణన్.. అతని కుమారులు మాలతి చనిపోయినప్పటికీ మూడు రోజుల తర్వాత బతికి వస్తుందని.. అందుకే పూజలు, ప్రార్థనలు చేసినట్లు తెలిసింది.. ఆమె బతికి రాకపోవడంతో అంత్యక్రియలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ట్విస్ట్ ఏంటంటే.. బాలకృష్ణన్ పెద్ద కుమారుడు మెడిసన్ పూర్తి చేయగా.. రెండో కుమారుడు ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. మెడిసన్ చదువుతున్న కొడుకులు ఉన్నప్పటీ బాలకృష్ణ మూఢ విశ్వాసాలపై నమ్మకంతో ఇలా చేయడం పై స్థానికంగా కలకలం సృష్టించింది.