భారతదేశంలో వివాహాల విషయంలో గతంతో పోలిస్తే చాలా మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. వేర్వేరు కులాల వాళ్లు వివాహం చేసుకోవడం, వేర్వేరు మతాల వాళ్లు కూడా ప్రేమించుకుని వివాహాలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వివాహాల విషయంలో వివాదాలు తలెత్తినప్పుడు కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. ఊర్లలో జరిగే పంచాయితీలు కానివ్వండి, కోర్టులకు వచ్చే కేసులు కానివ్వండి కాస్త అనిశ్చితి నెలకొంటుంది. అయితే తాజాగా మతాంతర వివాహాలపై సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..
హిందూ వివాహ చట్టం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. హిందువులు చేసుకునే వివాహాలకు ఈ చట్టం వర్తిస్తూ ఉంటుంది. హిందూ వివాహ చట్టం విషయంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు హిందువులు చేసుకునే వివాహాలకు మాత్రమే హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది అని స్పష్టం చేసింది. రెండు వేర్వేరు మతాలకు చెందిన వాళ్లు చేసుకునే వివాహాలకు హిందూ వివాహ చట్టం వర్తించదని వెల్లడించింది. అలాగే రెండు వేర్వేరు మతాలకు చెందిన ఏ ఇద్దరు వివాహం చేసుకున్నా.. అది హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తెలిపింది.
2017లో నమోదైన కేసు విషయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ కేసులో విషయంలో 2017లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ కేసు విషయానికి వస్తే.. ఓ మహిళ తెలంగాణ హైకోర్టులో కేసు దాఖలు చేసింది. 2008లో హిందువైన తాను క్రైస్తవ మతానికి చెందిన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తర్వాత అతను వేరే వివాహం చేసుకున్నాడని.. హిందూ వివాహ చట్టం సెక్షన్ 494 ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ కేసుపై ఆ వ్యక్తి స్పందిస్తూ తాను క్రైస్తవుడని.. తనకి హిందూ వివాహ చట్టం వర్తించదని వ్యాఖ్యానించాడు.
అలాగే తనని వివాహం చేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనందున కేసు కొట్టేయాలంటూ కోరాడు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు పూర్వా పరాలు పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం.. వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తులు చేసుకున్న వివాహం హిందూ వివాహ చట్టం ప్రకారం తెల్లదని స్పష్టం చేశారు. తదుపరి విచారణ ఫిబ్రవరి నెలకు వాయిదా వేశారు. ప్రస్తుతం ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మతాంతర వివాహాలు చేసుకున్న వారు, చేసుకోవాలని చూస్తున్నవారు సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.