తమ పిల్లలకు భవిష్యత్తులో ఎలాంటి కష్టం ధరి చేరకూడదని, ఉన్నతంగా స్థిరపడాలని అందరి తల్లిదండ్రులు కోరుకునేదే. ఈ క్రమంలో వారి వారి స్థోమతకు తగ్గట్టుగా విద్యాభ్యాసాన్ని అందిస్తున్నారు కానీ, ఆడపిల్లల పెళ్లి విషయం దగ్గరకు వచ్చేసరికి అదొక తలకు మించిన భారంగా భావిస్తున్నారు. అదే మీ ఆలోచన అయితే ఈ పథకంలో పెట్టుబడి ప్రారంభించండి. అదే మీ బిడ్డకు బంగారు భవిష్యత్ ఇస్తుంది.
ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఎప్పుడూ అమ్మాయి చదువు, పెళ్లి వంటి ఖర్చుల కోసం ముందు నుంచే పొదుపు మొదలు పెడతారు. అలా పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రం ‘సుకన్య సమృద్ధి యోజన’ అనే అద్భుతమైన పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో రోజుకు గరిష్ఠంగా రూ.416 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి రూ.71 లక్షలు దాకా పొందవచ్చు. అసలు ఈ పథకంలో ఎలా చేరాలి? అందుకు అర్హతల ఏంటి? ఎంత కడితే ఎంత మొత్తం లాభం పొందవొచ్చు.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
‘ఇంటికి దీపం ఆడపిల్ల’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో ఆడపిల్ల పేరు మీద తల్లిదండ్రులు/సంరక్షకులు డబ్బు పొదుపు చేయవచ్చు. అలా పొదుపు చేసిన సొమ్మును ఆడపిల్ల చదువు, పెళ్లి ఖర్చులకు వాడుకోవచ్చు. ఇందులో అన్ని పొదుపు స్కీమ్ ల కంటే గరిష్టంగా 7.6 శాతం వడ్డీ లభిస్తోంది.
ఈ స్కీమ్ కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ప్రవేశ పెట్టారు. పదేళ్ల లోపు ఉన్న ఆడపిల్ల పేరుమీద ఈ ఖాతా తెరవచ్చు. వయసు పదేళ్లలోపు ఉండాలి. ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లల పేరు మీద ఖాతాలు తెరవచ్చు. అమ్మాయి కచ్చితంగా భారతీయురాలు అయ్యి ఉండాలి. భారత్ లోనే నివాసముండాలి. ఏదైనా పోస్టాఫీస్, ఆథరైజ్డ్ బ్యాంకుల్లో రూ.250 ప్రవేశ రుసుముతో ఈ ఖాతాను తెరవచ్చు. కావాలంటే దేశంలో ఎక్కడికైనా ఉచితంగా ఆ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు/సంరక్షకులు ఎవరైనా ఈ ఖాతాను అమ్మాయి పేరు మీద తెరవచ్చు. బాలిక ఫొటో, తల్లిదండ్రులు/సంరక్షకుల ఫొటో, ఆధార్, బర్త్ సర్టిఫికేట్ వివరాలు సమర్పించాలి. 15 ఏళ్లపాటు/అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేవరకు ఈ ఖాతాలో నగదు పొదుపు చేయవచ్చు.
ఈ ఖాతాలో ఏడాదికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. అంటే నెలకు రూ.12,500, రోజుకు గరిష్టంగా రూ.416 పొదుపు చేసినట్లు అనమాట. అతి తక్కువగా ఏడాదికి రూ.250 కూడా పొదుపు చేయవచ్చు. ఏడాదికి రూ.250 కూడా జమ చేయకపోతే ఆ ఖాతా డిఫాల్ట్ అవుతుంది. రూ.250 జరిమానా కడితే మళ్లీ ఖాతాను పునరుద్ధరిస్తారు. నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తే 15 ఏళ్లకు మెచ్యూరిటీ అయ్యే సమయానికి మీకు రూ.5 లక్షలు అందుతాయి. నెలకు రూ.12,500 కడితే.. మెచ్యూరిటీ సమయానికి రూ.71 లక్షలు పొందవచ్చు. దేశంలో ఏ పొదుపు పథకంలో లేని విధంగా సుకన్య సమృద్ధి యోజన పథకంలో 7.6 శాతం వడ్డీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఆదాయపన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
అన్ని సందర్భాల్లో ఈ ఖాతా నుంచి నగదు తీసుకోవడం.. ఖాతాను ప్రీ క్లోజ్ చేయడం సాధ్యం కాదు. అమ్మాయికి 18 ఏళ్లు నిండాక చదువుకోసం డబ్బు తీసుకోవచ్చు. అలా తీసుకోవాలంటే ముందు సంవత్సరం చివర్లో ఉన్న మొత్తం నుంచి సగం సొమ్మును పొందవ్చచు. పెళ్లికి డబ్బు తీయాలంటే అమ్మాయికి కచ్చితంగా 21 ఏళ్లు నిండేదాకా ఆగాల్సిందే. ఖాతా మెచ్యూరిటీ అయ్యాక కూడా మీరు ఖాతా నుంచి డబ్బు తీసుకోకపోతే ఆ మొత్తంపై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రమాదవశాత్తు బాలిక మరణిస్తే ఖాతాకున్న నామినీకి ఆ డబ్బును అందజేస్తారు. బాలికకు హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఆ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్- 1800 266 6868ను సంప్రదించండి.