దేశానికి మంచి పౌరులను అందించే అతి పెద్ద బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్యార్ధులకు మంచి చెడుల మధ్య తేడాలు వివరించి.. వారిని సన్మార్గం వైపు నడిపే వారు ఉపాధ్యాయులు. చాలా మంది గురువులు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం నిత్యం పరితపిస్తుంటారు. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఆ వృత్తికి అపకీర్తి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. తాము పాఠశాలకు వచ్చేది.. పిల్లలకి విద్యాబుద్దులు నేర్పించేందుకు అనే విషయం మరచి సొంత పనుల్లో మునిగితేలుతుంటారు. అయితే ఇలా కొందరు ఉపాధ్యాయులు చేసే పనులకు విద్యార్థులు విసుగు చెందినా కూడా దండిస్తారనే భయంతో మౌనంగా ఉండిపోతారు. కానీ కొందరు విద్యార్థులు ధైర్యంగా వెళ్లి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంటారు. తాజాగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు రోడ్డుపై ధర్నా చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా అనైకట్టు తాలుకా మూల గేట్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠాశాలలో సుమారు 200 మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలకు రారు.. వచ్చినా సెల్ ఫోన్ లో మునిగిపోతున్నారు. అయితే చాలా కాలం పాటు వారి ప్రవర్తను గమనిస్తూ వచ్చిన విద్యార్ధులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి.. చెప్పిన కూడా ఆ ఉపాధ్యాయుల్లో మార్పు రాలేదు. దీంతో ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రావట్లేదని, పాఠాలు బోధించకుండా సెల్ ఫోన్లు చూస్తున్నారని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి, పాఠశాల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయినా లాభం లేకపోవడంతో గురువారం టీచర్ల, విద్యాశాఖ అధికారుల ప్రవర్తనకు విసుగు చెందిన విద్యార్థులు రోడెక్కారు. గురువారం మూలగేట్- అనైకట్టు గ్రామాల మార్గంలో రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారికి న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు హామి ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకోను విరమించారు. మరి.. ఇలా వృత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.