షర్మిలా అనే యువతి కోయంబత్తూర్ లో తొలి మహిళా డ్రైవర్ గా బస్సును నడిపిన విషయం తెలిసిందే. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే పబ్లిసిటి ఆమె జాబ్ పోయేలా చేసింది.
ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వంటింటి నుంచి అంతరిక్షం వరకు తమ ప్రతిభను చూపుతూ విజేతలుగా నిలుస్తున్నారు. సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా ఇలా అన్నిరంగాల్లో తమదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ కొన్ని నెలల క్రితం బస్సు డ్రైవర్ గా చేరి యువతకు ఆదర్శంగా నిలిచింది. దీంతో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెతో సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. దీంతో ఆమెకు విపరీతమైన పబ్లిసిటి వచ్చింది. ఇప్పుడు అదే పబ్లిసిటి ఆమె పాలిట శాపంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది? పబ్లిసిటి వల్ల ఆమెకు కలిగిన నష్టం ఏమిటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా అందరికంటే భిన్నంగా, వినూత్నంగా ఏదైన పని చేసినప్పుడు ప్రశంసలు, పొగడ్తలు వస్తుంటాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఇదే విధంగా తమిళనాడు లోని కోయంబత్తూర్ లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సుకు మొదటి మహిళా డ్రైవర్ గా షర్మిలా విధులు నిర్వహించి అందరి ప్రశంసలు పొందింది. అనతి కాలంలోనే సెలబ్రిటీగా మారిపోయింది. ఆమెతో సెల్పీల కోసం యువత, ఇతర వర్గాల వారు ఆసక్తి చూపించే వారు. మీడియా కూడా ఆమెతో ఇంటర్య్వూల కోసం క్యూ కట్టారు.
తాజాగా షర్మిల నడిపే బస్ లో ఎంపి కనిమొళి ప్రయాణించారు. బస్ డ్రైవర్ గా రాణిస్తున్న షర్మిలను, ఆమె ధైర్యసాహసాలను కనిమొళి ప్రశంసించారు. దీంతో షర్మిలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఇదే పబ్లిసిటి ఆమె ఉద్యోగం పోయేలా చేసింది. షర్మిల కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో ఫొటోలు, ఇంటర్య్వూల తో బస్సు ప్రయాణ ట్రిప్పులు తగ్గుతున్నాయని ట్రావెల్ యాజమాన్యం ఆరోపించింది. దీంతో రోజువారి ఆదాయం కూడా తగ్గిందని బస్సు ఓనర్ తెలిపారు. ఇదిలా ఉంటే తనను ట్రావెల్ యాజమాన్యం అవమానించిందని దాంతో ఉద్యోగం మానేస్తున్నానని ఇకపై ఆ బస్సు నడపనని షర్మిల తెలిపింది.