రాజస్థాన్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని ఆ ఊరి ప్రజలు వ్యతిరేకించారు. ఊరంతా ఏకమై ఆంగ్ల మాధ్యమం మాకొద్దంటూ ప్రభుత్వానికి విన్నవించారు. హిందీలోనే తమ పిల్లకు పాఠాలు చెప్పాలని కోరారు. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో హైకోర్టు మెట్లెక్కగా. తాజాగా కోర్టు తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఆ గ్రామం వార్తలో నిలుస్తుంది. అదే జోధ్ పూర్ జిల్లా లోహవత్ అసెంబ్లీ పరిధిలోని పిల్వా గ్రామం.
వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ భావించింది. ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయం తీసుకుంది. దీని నిమిత్తం ఇప్పటికే వెయ్యి హిందీ మీడియం పాఠశాలలను ఇంగ్లీషు మాధ్యమాలుగా మార్చివేసింది. ఈ విషయం పిల్వా గ్రామస్థులకు మింగుడు పడలేదు. ఈ విధానంతో తమ పిల్లలు నష్టపోతారని భావించిన పాఠశాల అభివృద్ధి నిర్వహణ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఏకమై..ఇంగ్లీషు మీడియంలో చదువులు వద్దంటూ విద్యాశాఖకు వినతులు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు.
న్యాయ స్థానం నుండి స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. కాగా, దీనిపై విద్యాశాఖ కూడా కోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గ్రామస్థులకు మద్దతుగా తీర్పునిచ్చింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టవద్దని, హిందీలోనే బోధించాలని ఆదేశించింది. తీర్పు పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ‘1945లో ఈ స్కూల్ ప్రారంభమైంది. 2021 వరకు ఈ ఊరి స్కూల్ లో 800 మంది విద్యార్థలు చదివేవారు. అప్పట్లో హిందీలోనే విద్యాభోదన సాగేది. 2022 నుండి ఇంగ్లీషు మీడియాన్ని తీసుకువచ్చారు. ఎనిమిదో తరగతి వరకు హిందీలో చదివి, తొమ్మిదో తరగతిలో ఇంగ్లీషు మీడియం చదివేదందుకు మా పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో స్కూల్ కు పోవాలంటే 8-10 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది‘ అని గ్రామస్థులు తెలిపారు.
ప్రస్తుతం వీరి స్కూల్ శిథిలావస్థకు చేరుకోగా.. ఠాకూర్ గోపాల్ సింగ్ అనే వ్యక్తి విరాళా సేకరణతో కొత్త భవనం నిర్మించారు. సైన్యంలో లెఫ్టినెంట్ గా పనిచేసి ప్రాణాలు అర్పించిన తన కొడుకు హరి సింగ్ పేరు మీద ఈ స్కూల్ నిర్మాణం చేశాడు. ఈ 78 ఏళ్లలో ఈ ఊరి నుండి 500 మందికి పైగా భారత సైన్యంలో చేరారు. మాతృభాషలోనే విద్యాబోధన సాగించాలని భావిస్తూ పోరాటం చేసిన ఆ గ్రామస్థుల పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.