కేరళ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. తొలి స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను జాతికి అంకితం చేశారు. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కేరళ తీరంలో ఈరోజు ఒక కొత్త శకం ప్రారంభమైందని, అమృతోత్సవ వేడుకల వేళ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక ప్రారంభం శుభపరిణామమని, ఈ నౌకను జాతికి అంకితం చేస్తున్నానని ప్రధాని అన్నారు. భారత్ కు సాధ్యం కానిది ఏదీ లేదని, ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకను చూసి భారతీయులంతా గర్వపడాలని అన్నారు.
ఐఎన్ఇఎస్ విక్రాంత్ యుద్ధ నౌక రానంత వరకూ భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది ఇప్పుడు అగ్ర దేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ విక్రాంత్ ను భారత్ రూపొందించింది. దీంతో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ పక్కన మన భారత్ కూడా తలెత్తుకు నిలబడింది. ఐఎన్ఎస్ నౌక పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో 13 ఏళ్ల పాటు శ్రమించి తయారుచేశారు. దీన్ని తయారు చేసేందుకు రూ. 20 వేల కోట్లు ఖర్చయ్యింది. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో.. 37,500 టన్నుల బరువు కలిగిన ఈ బాహుబలి నౌకలో మొత్తం 14 అంతస్తులు, 2300 కంపార్ట్మెంట్లు ఉన్నాయి.
దీని తయారీ కోసం దాదాపు 1700 మంది సిబ్బంది పని చేశారు. రెండు టేకాఫ్ రన్ వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ లతో క్షిపణి దాడిని తట్టుకునేలా దీన్ని రూపొందించారు. గత ఏడాది విజయవంతంగా ట్రైల్స్ వేశారు. చైనాతో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న క్రమంలో ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపు నేపథ్యంలో ఈ భారీ బాహుబలి యుద్ధ నౌక తయారయ్యింది.ఈ యుద్ధనౌకను మోదీ కొచ్చిన్ తీరాల్లో నావికాదళానికి అప్పగించనున్నారు. మరి తొలి స్వదేశీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లాంచ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.