నేటికాలంలో చాలామంది యువత రాజకీయాలపై ఆసక్తి చూపించడం లేదు. అంగబలం, అర్ధబలం వంటివి ఉన్నవారే రాజకీయాల్లో నెగ్గుకు రాగలరనే అభిప్రాయంతో యువత ఉన్నారు. అందుకే ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడితే చాలు అని భావిస్తున్నారు. మరికొందరు విదేశాల్లో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇలా దేశంలోని ఎందరో యువత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే కొందరు యువత మాత్రం రాజకీయాల ద్వారానే ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయవచ్చని నమ్ముతారు. ఈక్రమంలో ఎంతో మంది యువ ఇంజనీర్లు, వైద్యులు.. తమ వృత్తిని పక్కన పెట్టి రాజకీయాల్లోకి దిగి విజయం సాధించారు. తాజాగా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఓ యువతి.. గ్రామస్తుల పిలుపు మేరకు ఊరికి వచ్చి.. సర్పంచిగా గెలుపొందారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఆ యువతి.. ఇలా అనుకోని పరిణామాలతో రాజకీయాల్లోకి ఎంట్రి ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మహారాష్ట్ర లోని మిరాజ్ జిల్లాలోని వడ్డి గ్రామానికి చెందిన యశోదర రాజేశిందే(21) వైద్య విద్యను అభ్యసిస్తోంది. యూఎస్ఏలోని జార్జియా స్టేట్ లోని న్యూ విజన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. కష్టపడి డాక్టర్ కోర్సును పూర్తి చేసి.. ప్రజలకుసేవ చేయాలని యశోదర ఆకాంక్షించింది. అలానే తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా యశోదర కష్టపడి చదువుతోంది. ఈ క్రమంలోనే ఆమె స్వగ్రామమైన వడ్డి లో పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. అయితే ఆ గ్రామంలో యశోదర తండ్రి మహేంద్రసింగ్ కు, అతడి పూర్వీకులకు మంచి పలుకుబడి ఉంది. యశోదర పూర్వీకులు 30 ఏళ్ల నుంచి నర్వాడ్ పంచాయితీలోని గ్రామాలకు సేవలు అందించారు. అయితే ఈ సారి రిజర్వేషన్ కారణంగా ఇంట్లోని మగవారికి అవకాశం లేకుండా పోయింది.
దీంతో గ్రామస్థులు, ఆమె కుటుంబ సభ్యులు యశోదరను సర్పంచి ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. చివరకు ఆమెను జార్జియా నుంచి స్వదేశానికి రప్పించి.. ఎన్నికల బరిలో నిలిపారు. యశోదరకు పోటీగా గతంలో సర్పంచిగా పనిచేసిన వ్యక్తి నిలిచారు. ఈ క్రమంలో ఇద్దరూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేశారు. యశోదర తనదైన మాటలతో ఓటర్లను ఆకట్టుకుంది. ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో యశోదర సమీప ప్రత్యర్ధిపై 149 ఓట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తాను ఇచ్చిన హామీలను తప్పక నిరవేరుస్తాని యశోదర మాటఇచ్చారు. అలానే సర్పంచిగా గెలిచినప్పటికి తన వైద్యవిద్యను వదిలిపెట్టబోనని ఆమె తెలిపారు. ఇలా చదువుతూనే ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమైన ఈ యువతి నేటితరం యువతకు ఆదర్శం. మరీ.. ఈ యువ సర్పంచి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.