భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. అసలు గొడవలు లేకపోతే.. అది ఆలుమగల బంధం కాదనే అంటారు. ఇక దంపతులు మధ్య ఎన్ని గొడవలు వచ్చినా.. సర్దుకుపోయి ముందుకు సాగుతుంటారు. కానీ కొందరు మగమహారాజులు.. తాము పుట్టిందే భార్య మీద పెత్తనం చెలాయించడానికి అన్నట్లు ప్రవర్తిస్తారు. వారి దృష్టిలో భార్య అంటే.. ఓ యంత్రం మాత్రమే. ప్రతి చిన్న దానికి భార్యతో గొడవపడటం.. అయినదానికి కాని దానికి వారి మీద విరుచుకుపడటం.. అది చాలదన్నట్లు చేయి చేసుకోవడం ఇలాంటి దుర్మార్గాలు చేస్తుంటారు.
ఇక కొందరు ఆడవాళ్లు.. వీటన్నింటిని మౌనంగా భరిస్తూ ఉంటారు. ఎవరితో చెప్పుకోరు. మరికొందరు మాత్రం.. భరించినన్న రోజులు భరించి.. సహనం కోల్పోయిన రోజు.. ఆదిశక్తి అవతారం ఎత్తుతారు. అప్పుడు భర్త బిగుసుకు పోవాలి. ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఓ వ్యక్తికి. రోజు వచ్చి భార్యను హింసించడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఇక అతడి ఆగడాలు తట్టుకోలేకపోయిన భార్య సలసలా కాగే రసం తెచ్చి అతడి ముఖం మీద పోసింది. దాంతో సదరు వ్యక్తి.. తన భార్యను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని ఓ స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఈ ఘటన జరిగింది. విల్లుపురంలోని జయం కొండన్ అనే గ్రామంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. నటరాజన్ అనే వ్యక్తి ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి.. భార్యను నోటి కొచ్చినట్లు తిట్టి చావబాదేవాడు. ఇద్దరి మధ్య ప్రతి రోజు గొడవలయ్యేవి. భార్య ఎన్నో రోజుల పాటు ఓపిక పట్టింది. కానీ మొగుడి టార్చర్ మరీ ఎక్కువ కావడంతో ఇక తట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో జూన్ 13 న రాత్రి కూడా నటరాజన్ తాగి ఇంటికి వెళ్లాడు. రోజులాగే పెళ్లాంతో గొడవ పెట్టుకున్నాడు.
అప్పటికే మాంచి తిక్కమీద ఉన్న అతగాడి భార్య.. సలసల కాగుతున్న రసాన్ని మొగుడి మీద విసిరికొట్టింది. దీంతో అతను భయంతో బయటకు పరుగులు పెట్టాడు. తాగిన మత్తులో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు. తన భార్యను అరెస్టు చేయాలని కోరాడు. మొదట ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని పోలీసులు అతడికి సూచించారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో అతను తిండివనం-కృష్ణగిరి చౌరస్తా చేరుకున్నాడు. అక్కడ కూడా తన భార్యమీద చర్యలు తీసుకోవాలని గట్టిగా అరిచాడు. రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్న అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మత్తు దిగాక ఇంటికి వెళ్లిపోయాడు. అతను ఎలాంటి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.