దేశంలో నకిలీ వైద్యులు బాగోతాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. డాక్టర్ డిగ్రీ కాదు కదా కనీసం డిగ్రీ కూడా లేని వాళ్లు వైద్యులుగా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జనాలు కూడా వీరిని అమాయకంగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో వచ్చిన జనాలకు నకిలీ వైద్యుడు ఒకరు ఏకంగా పశువుల ఇంజెక్షన్ ఇచ్చాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సదరు వైద్యుడు నకిలీ అని తేలడం.. తమకిచ్చింది పశువుల ఇంజక్షన్ అని వెల్లడి కావడంతో జనాలు తీవ్రంగా భయపడతున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
అహ్మద్‌నగర్‌లోని పథర్డి తాలూకా ఖండోబావాడిలో ఈ ఘటన జరిగింది. రాజేంద్ర జవాంజలే అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం కరంజి సమీపంలోని ఖండోబావాడికి వైద్యుడిగా వచ్చాడు. అతడిని నిజమైన డాక్టర్ అనుకున్న గ్రామస్తులు.. రాజేంద్ర దగ్గరికి వచ్చి తమ అనారోగ్య సమస్యలు చెప్పుకున్నారు. మెడ, మోకాళ్లు, నడుము నొప్పులతో బాధపడుతున్న వారికి.. ఇంజెక్షన్లు ఇచ్చాడు. నొప్పులున్న చోటే ఇంజెక్షన్ ఇచ్చి ఒక్కొక్కరి నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేశాడు.
అయితే ఈ నకిలీ వైద్యుడి తీరుపై గ్రామంలోని కొందరు యువకులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో సదరు డాక్టర్ బ్యాగ్ తీసుకుని పరిశీలించారు. దానిలో కొన్ని ఇంజక్షన్ బాటిల్స్ ఉన్నాయి. వాటి మీద జంతువుల బొమ్మలుండటంతో.. అతడిని పట్టుకుని ప్రశ్నించగా.. అవి పశువులకు వేసే ఇంజక్షన్‌లు అని.. తాను అసలు వైద్యుడినే కాదని తెలిపాడు. దాంతో సదరు నకిలీ వైద్యుడిని తీసుకెళ్లి.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు బాబాసాహెబ్ హోద్‌షీల్‌కు అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు నకిలీ వకైద్యుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతడి బ్యాగ్‌లో ఉన్న మందులను స్వాధీనం చేసుకున్నారు.
ఆరోగ్యశాఖ ఏమన్నదంటే..
ఈ ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్య శాఖ స్పందించింది. బోగస్ వైద్యుడి నుంచి చికిత్స పొందిన గ్రామస్తులకు పరీక్షలు చేయిస్తోంది. ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే వెంటనే ఆరోగ్య శాఖను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచించారు. అలాగే ఈ విధంగా బోగస్ వైద్యులెవరైనా కనిపిస్తే ఆరోగ్య శాఖకు తెలియజేయాలన్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.