చదువుకోవాలి.. జీవితంలో పైకి ఎదగాలనే కోరిక ఉన్న వారిని పేదరికం, ఇతరాత్ర ఇబ్బందులు, సమస్యలు ఏం చేయలేవు. మన చుట్టూనే ఎంతో మంది కటిక పేదరికాన్ని అనుభవిస్తూ.. ఎన్నో ఇబ్బందులు పడుతూ.. చదువుకుని జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరిన వారు ఉన్నారు. చదువుకోవాలంటే డబ్బు.. ఎలాంటి సమస్యలు లేని కుటుంబం ఉండగానే సరిపోదు.. మనసులో బలమైన సంకల్పం ఉండాలి. కృతనిశ్చయం ఉన్న వారు జీవితంలో రాణిస్తారు. ఇప్పుడు మీరు చదవబోయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. రెక్కాడితే గాని డొక్కాడని జీవితం ఆ కుర్రాడి తల్లిదండ్రులది. అయినా సరే బిడ్డను బాగా చదవించాలనుకున్నారు. స్కూల్‌లో జాయిన్ చేస్తే.. టీచర్లు రెండో తరగతిలోనే… వీడు చదువుకు పనికిరాడని తెల్చేశారు. మరి టీచర్లు చెప్పినట్లే.. ఆ పిల్లాడు చదువు మానేశాడా.. లేదు.. మరింత పట్టుదలతో చదివి.. జేఈఈలో 99 శాతం మార్కులు స్కోర్ చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు..
వెల్డింగ్ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్(తొలి రౌండ్).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్ చేశాడు. ప్రసుత్తం దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మొగిపోతుంది. అతని పేరు దీపక్ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఆ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్ చేయగలడని అతడికి చదువు చెప్పిన టీచర్లే కాక పిల్లాడి తల్లిదండ్రులు కూడా ఊహించలేదు. రెండో తరగతిలోనే వీడిక చదువుకు పనికిరాడు అంటూ టీచర్లు ఇంటికి పంపిస్తే.. పట్టుదలతో ప్రయత్నించి విజయం సాధించాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దెవాస్, దీపక్ సొంత ఊరు. దీపక్ తండ్రి రామ్ ఎక్‌బల్ ప్రజాపతి.. వెల్డింగ్ కూలీ. పెద్దగా చదువుకోని ఆయన.. కొడుకును కష్టపడి చదివించి ఉన్నతస్థాయిలో చూడాలనుకున్నాడు. కానీ, కొడుకు మాత్రం చిన్నతనంలో తోటి పిల్లలతో సరదాగా గడపడం పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. దీంతో చదవులో రాణించలేడంటూ ఇంటికి పంపించేశారు. కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆ తండ్రి ఆందోళన చెందాడు.
అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్న ఆ చిన్నారి.. తండ్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. క్రమక్రమంగా చదువులో మెరుగవుతూ.. పదో తరగతిలో 96 శాతం మార్కులు సంపాదించాడు. కొందరు టీచర్ల సలహాతో కంప్యూటర్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ) చేయాలనుకున్నాడు. ఐఐటీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. దీపక్ ప్రాథమిక విద్య అంతా స్థానికంగా ఒక స్కూల్‌లోనే సాగింది. లాక్‌డౌన్ టైంలో తొమ్మిదవ తరగతి కష్టంగా సాగిందట. కారణం.. స్మార్ట్ ఫోన్ లేకపోవడం. అయితే తండ్రి ఎలాగో కష్టపడి కొడుకు కోసం ఓ ఫోన్ కొన్నాడు. జేఈఈ కోసం ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు.
ఇందుకోసం మధ్యప్రదేశ్ ఎడ్యుకేషన్ హబ్‌గా పేరున్న ఇండోర్‌కు వెళ్లాడు. రోజుకు 13 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాకు దూరం ఉండడం అతనికి అలవాటు అయ్యింది. ఒకవేళ బోర్‌గా ఫీలైతే.. బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆడడం లాంటివి చేశాడట. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేవాళ్లకు తన అనుభవపూర్వకంగా దీపక్ ఒక సలహా ఇస్తున్నాడు. మిమ్మల్ని మీరు నమ్ముకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం.. ఇవే తన విజయానికి కారణమని చెప్తున్నాడు దీపక్ ప్రజాపతి. మరి ఈ పేదింటి బిడ్డ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.