ఈ మద్య ప్రతి చోట లంచం లేనిదే పని జరిగే పరిస్థితి లేదు. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు ఉంటారని టాక్ ఉండేది.. కానీ ఇప్పుడు కార్పోరేట్ కంపెనీల్లో సైతం ఉద్యోగం కావాలంటే ఎంతో కొంత లంచం సమర్పించుకోవాల్సిందే అనే పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం అని ఎంతగా చెబుతున్నా ఎక్కడో అక్కడ లంచగొండి అధికారుల భాగోతాలు బయట పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు సంబంధించిన ఏ పని జరగాలన్నా అటెండర్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం ఇస్తే కానీ పనులు కాని దుస్థితి నెలకొందని బాధితులు గోడు వెల్లబోస్తున్నారు. కొన్నిసార్లు లంచావతారులను ఏసీబీ పట్టుకొని శిక్షించినప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ఓ అధికారి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న ఎద్దును లంచంగా తీసుకోమని ఏకంగా ఆఫీస్ కే తొలుకొచ్చాడు రైతు. దాంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మె సొంత జిల్లా హవేరీ లో ఓ లంచగొండి భాగోతం బయటపడింది. జిల్లా మున్సిపాలిటీకి చెందిన ఎల్లప్ప రానోజి అనే రైతు మునిసిపల్ రికార్డుల్లో మార్పు కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని చేయడానికి సదరు సెక్షన్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దాంతో చేసేదేమీ లేక ఆ అధికారికి కొంత లంచం ఇచ్చాడు. అంతలోనే ఆ అధికారికి బదిలీ అయ్యింది.. కానీ ఎల్లప్ప పని మాత్రం చేయలేదు. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. సంబంధింత సెక్షన్ కి కొత్త అధికారి వచ్చాడు.. అతని వద్ద తన దరఖాస్తు విషయం గురించి చెప్పాడు ఎల్లప్ప.
కొత్తగా వచ్చిన అధికారి సైతం ఎల్లప్పను డబ్బులు డిమాండ్ చేశాడు. అంతకు ముందు ఉన్న అధికారికి లంచం ఇచ్చానని.. తన వద్ద ఇవ్వడానికి ఇంకా ఏమీ లేదు.. తాను పేద కుటుంబానికి చెందినవాడినని అధికారితో ఎల్లప్ప ఎంతగానో మొరపెట్టుకున్నాడు.. కానీ ఆ అధికారి మనసు మాత్రం కరగలేదు. డబ్బులిస్తేనే పని జరుగుతుందని తేల్చి చెప్పాడు. అంతే కాదు గతంలో అధికారికి ఇచ్చిన లంచం కన్నా తనకు ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేశాడు సదరు అధికారి. అప్పటికే ఆ పని కోసం అప్పు చేసి మరీ లంచం ఇవ్వగా.. కొత్త అధికారికి డబ్బులు ఎక్కడ నుంచి తీసుకు రావాలో అర్థం కాక తలపట్టుకున్నాడు ఎల్లప్ప.
ఇక ఎల్లప్పకు ఏం చేయాలో పాలుపోలేదు.. తన వద్ద ఉన్న ఎద్దులో ఒక దాన్ని కార్యాలయానికి తీసుకు వచ్చి డబ్బులు అడిగిన అధికారిని డబ్బులకు బదులుగా ఈ ఎద్దును తీసుకోవాలని ప్రాధేయపడ్డాడు. ఈ సంఘటనలతో అక్కడ అందరూ ఆశ్చర్యపోయాడు. లంచగొండి అధికారిపై దుమ్మెత్తి పోశారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో సదరు అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎల్లప్ప పని చేసిపెడతామని హామీ ఇచ్చారు అధికారులు.