పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఇక అమ్మాయి, అబ్బాయి కుటుంబాల నేపథ్యం, వారి ఆస్తిపాస్తులు వంటి వివరాలు తెలుసుకుని.. నెలకు ఎంత సంపాదించగలడో కన్నుకుని.. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు చూసి.. అవి కూడా కుదిరితేనే.. అప్పుడు పెళ్లి బాజాలు మోగుతాయి. వివాహం అంటే ఇంత పెద్ద తతంగం. ఇక కట్నకానుకల సంగతి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా సరే.. బోలేడు కట్నం ఇచ్చి పెళ్లి చేయాల్సిన పరిస్థితి. ఏమాత్రం సిగ్గుపడకుండా అమ్ముడు పోవడానికి రెడీ అవుతారు మగమహరాజులు. కానీ నూటికో కోటికో ఒకరో ఇద్దరో కాస్త ఆత్మాభిమానం కలవారు ఉంటారు.
జీవితాంతం తనతో కలిసి బతకబోయే అమ్మాయి తనను అర్థం చేసుకుంటే చాలు.. డబ్బులతో నాకేం పని.. నేను కష్టపడి సంపాదించుకోగలను అని భావిస్తారు. ఇంకొందరు ఆదర్శవాదులు.. ఏమిలేని వారికి మంచి జీవితం ఇవ్వాలని ఆలోచించడమే కాక ఆచరించి చూపుతారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడు ఒకరు.. అనాథ యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ వివరాలు..
ఈ సంఘటన కర్ణాటక, హుబ్లీ కేశ్వాపురలోని అనాథ శరణాలయంలో చోటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన సరస్వతి-నంజుండరావ్ అనే దంపతుల కుమారుడు.. హేమంత్.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు అతడికి కేశ్వాపురలోని అనాథ యువతి గురు సిద్ధమ్మతో వివాహం నిశ్చయించారు. ఆమె కులగోత్రాలు, హోదాలతో సంబంధం లేకుండా.. మంచి యువతి మన ఇంటికి కోడలైతే చాలనే ఉద్దేశంతో గురుసిద్ధమ్మను తమ కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు.
హేమంత్ కూడా తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించి.. గురుసిద్ధమ్మను వివాహం చేసుకోవడానికి సంతోషంగా అంగీకరించాడు. ఇక గురుసిద్ధమ్మ ఉండే అనాథ శరణాలయంలోనే వీరి వివాహం జరిగింది. తోటి అనాథలంతా.. పెళ్లి పెద్దలై.. దగ్గరుండి గురుసిద్ధమ్మ-హేమంత్‌ల వివాహం జరిపించారు. ఈ వేడుకకు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హేమంత్ చేసిన పనిపై ప్రశంసలు కురిపించడమే కాక.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక గురుసిద్ధమ్మ తల్లీదండ్రి ఆమె బాల్యంలోనే చనిపోయారు. దాంతో.. చిన్నప్పుడే ఆమెను ఈ ఆశ్రమంలో చేర్చారు.